
కూటమి నిరంకుశత్వాన్ని ఖండిద్దాం
‘సాక్షి’ఎడిటర్, రిపోర్టర్లకు జిల్లాజర్నలిస్టు సంఘాల సంఘీభావం
కేసులను ముక్తకంఠంతో ఖండించిన ప్రధాన పార్టీల నేతలు
రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కారు ‘సాక్షి’పత్రిక విషయంలో వ్యవహరిస్తున్న నిరంకుశత్వాన్ని జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఏపీ పాలకుల ప్రోద్బలంతో అక్కడి పోలీసులు ‘సాక్షి’ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు, విలేకరులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛను హరించేలా అక్కడి పోలీసులు తీరును తప్పుబడుతున్నాయి. ఏపీలో జరుగుతున్న దమననీతిని ప్రతీఒక్కరు ఖండించాల్సిందేనంటున్నారు. ‘సాక్షి’ఎడిటర్ ధనంజయరెడ్డి, విలేకరులకు జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సంఘీభావాన్ని తెలిపారు. ఆయా పార్టీల నాయకులు, జర్నలిస్టు సంఘాల నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి :
ఏపీలో నియంతృత్వ పాలన
పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఏపీలోని కూటమి సర్కారు నియంతృత్వ పాలన సాగిస్తోంది. తమను విమర్శించే వార్తలు ప్రచురితమైతే వివరణ ఇవ్వాలే కానీ, పాలకుల ప్రోద్బలంతో పత్రికలపై పోలీసులు కేసులు పెట్టడం సరికాదు. పత్రికల విషయంలో కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి.
– మల్లేశం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి. మెదక్
పత్రికా స్వేచ్ఛను హరించడమే
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కారు పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఏపీలో జరుగుతున్న దమన నీతిని ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాలి. నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ వార్తలు రాస్తున్న ‘సాక్షి’పై కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. ‘సాక్షి’ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు, ఈ పత్రికా రిపోర్టర్లపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి.
– బండారు యాదగిరి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు
హక్కులను కాలరాయడమే
ఏపీలోని కూటమి ప్రభుత్వం ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమే. ‘సాక్షి’ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు పెట్టడం అంటే ప్రశ్నించే గొంతు నొక్కడమే.
– అక్కపల్లి యోగానందరెడ్డి,జిల్లా అధ్యక్షుడు, టెంజు
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిత్యం ప్రతికలు వెలుగులోకి తెస్తాయి. పత్రికల్లో వచ్చే రాజకీయ విమర్శల వార్తల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు రాజ్యంగబద్ధంగా వ్యవహరించాలి. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిబంధనల ప్రకారం మాత్రమే ముందుకెళ్లాలి.
– చిన్నమైల్ గోదావరి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు
గొంతు నొక్కే ప్రయత్నమే
పత్రికలపై కేసులు పెట్టడం..ప్రశ్నించే వారి గొంతు నొక్కేలా వ్యవహరించడం ఏ ప్రభుత్వాలకు మంచిదికాదు. నేతలు మాట్లాడిన మాటలు ప్రచురించినందుకు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు, విలేకరులపై కేసులు పెట్టడం అంటే కక్షసాధింపే అవుతుంది. నిత్యం ప్రజాసమస్యలను వెలికి తీసే పత్రికల గొంతునొక్కడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
– నిర్మలారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు
కక్ష సాధింపు సరికాదు
పత్రికలపై ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు. ‘సాక్షి’ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు, అక్కడి విలేకరులపై కేసులు పెట్టడం అంటే ఆ ప్రభుత్వం అభద్రతాభావంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పత్రికల గొంతు నొక్కడం అంటే ప్రజాస్వామ్యాన్ని హరించడం, దాడి చేయడమే అవుతుంది. – చింత ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే