
పంట నష్టం అపారం
● ఆందోళనలో రైతులు ● నివేదిక తయారుచేసిన అధికారులు
జహీరాబాద్ టౌన్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలో ఖరీఫ్ పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. రూ.వేల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. నారింజ వాగు పరీవాహక ప్రాంతాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక పంపించామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జహీరాబాద్ డివిజన్ పరిధిలో జహీరాబాద్, న్యాల్‌కల్, ఝరాసంగం, కోహీర్ మండలాలు మండలాల్లో వేసిన పెసర, మినుము,పత్తి, సోయాబిన్, కంది తదితర పంటలను రైతులు సాగు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెసర, మినుము, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇక పత్తి చేలలోనీళ్లు నిలిచి కాయలనుంచి పత్తి బయటకొచ్చిందని తెలిపారు. ఇప్పటికే రైతుల పట్టపాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్ తదితర వివరాలను అధికారులు సేకరించారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను నివేదికలను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. నారింజ వాగు ప్రాంతంలో పంట నష్టం అధికంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పంటలలో నీరు నిలువ ఉండటం వల్ల చీడపీడల బెడద కూడా పెరగకుండా వ్యవసాయ అధికారులను సంప్రదించి తగు సూచనలు సలహాలు తీసుకోవాలి.
– భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్
ప్రభుత్వం ఆదుకోవాలి
భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయాం. కోత దశలో ఉన్న పెసర, మినుము పూర్తిగా దెబ్బతింది. పత్తి పంట కూడా రంగు మారుతోంది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలి.
– శ్రీనివాస్, రైతు కంబాలపల్లి