
కుమ్మేసిన వాన
మెదక్‌లో అత్యధికంగా17 సెం.మీ వర్షపాతం
● కొల్చారంలో 8 సెం.మీ నమోదు ● లోతట్టు ప్రాంతాలు జలమయం
మెదక్‌జోన్: భారీ వర్షంతో మెదక్ మరోసారి అతలాకుతలం అయింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటల పాటు కురిసిన కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా రాందాస్ చౌరస్తాలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షం నీరు భారీగా నిలిచింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు దుకాణాల్లోకి నీరు చేరింది. స్పందించిన మున్సిపల్ అధికారులు అడ్డుగా ఉన్న డివైడర్‌ను జేసీబీతో తొలగించి నీరు దిగువకు వెళ్లేలా చేశారు. అలాగే పట్టణంలోని గాంధీనగర్‌లో పలువురి ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు అవస్థలు పడ్డారు. బృంధావన్‌నగర్, ఫతేనగర్, సాయినగర్, నర్సిఖేడ్ కాలనీలు జలమయం అయ్యాయి. అలాగే మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 17 సెంటీ మీటర్లు, కొల్చారం మండలంలో 8 సెంటీ మీటర్లు, హవేళిఘణాపూర్‌లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.