
ఆక్రమిస్తే అంతే సంగతులు
రామాయంపేట(మెదక్): అటవీ భూముల పరిరక్షణలో భాగంగా ఆక్రమణదారులపై ఆ శాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఇందులోభాగంగా ఆక్రమణదారులపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదు చేసి సదరు భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటుతున్నారు.
ఆనుకున్న భూమిని ఆక్రమించుకుని..
జిల్లా పరిధిలో 57 వేల హెక్టార్లకు పైగా అటవీభూమి ఉంది. గతంలో కొన్ని గిరిజన తండాల్లో ఏళ్ల తరబడి కబ్జాలో ఉన్న వారికి ప్రభుత్వం అటవీ హక్కుల పట్టాలిచ్చింది. ఇలా పట్టాలు పొందినవారితోపాటు మారుమూల గ్రామాల్లో కొందరు తమ భూములను ఆనుకుని ఉన్న అటవీ భూమిని నెమ్మదిగా ఆక్రమించేసుకుంటున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా ప్రతి ఏటా కొంతమేర కబ్జాకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అటవీ అధికారులు ఆక్రమణదారులపై కేసులు నమోదు చేశారు. దీంతోపాటుగా సదరు భూముల్లో దున్నకాలు చేపట్టిన ట్రాక్టర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీన భూమిలో మొక్కలు
నాటుతున్న అధికారులు
కాగా ఆక్రమణదారులనుంచి తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్న భూముల్లో అధికారులు ఇప్పటివరకు 40 వేల మొక్కలు నాటారు. మరో 60 వేల మొక్కలు నాటుతామని చెబుతున్నారు.
జిల్లా పరిధిలో సుమారుగా ఆరు వేల ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో రంగంలో దిగిన అటవీ అధికారులు దాడులు నిర్వహిస్తూ ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. గత జూలైలో రామాయంపేట మండలం బాపనయ్య తండాలో ఐదెకరాలమేర అటవీ భూమి కబ్జాకు గురైనట్లు తెలుసుకున్న అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై కేసు నమోదు చేశారు. గతేడాది హవేళీఘనపూర్ మండల పరిధి తండాల్లో ఆక్రమణకు గురైన భూములను విడిపించే క్రమంలో గిరిజనులకు, అటవీ సిబ్బందికి మధ్య ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే.
ఆక్రమిస్తే కఠిన చర్యలే
అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని మండలాల్లో కేసులు నమోదు చేశాం. స్వాధీనం చేసుకున్న భూముల్లో 40 వేల మొక్కలు నాటాం.
– జోజి, జిల్లా అటవీ అధికారి
అటవీ భూమి పరిరక్షణపై దృష్టిసారించిన అధికారులు
ఆక్రమణదారుల చేతుల్లో ఆరువేల ఎకరాల అటవీ భూములు
స్వాధీనం చేసుకుని మొక్కలు నాటుతున్న వైనం