
మొన్న తల్లి.. నేడు తండ్రి మృతి
● చిన్నారుల పరిస్థితి దైన్యం
● వెంటాడిన వరుస విషాదాలు
● గౌరారంలో విషాదం
వర్గల్(గజ్వేల్): విధి ఆడిన వింత నాటకం.. రెండు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులు, అమ్మమ్మ.. కానరాని తీరాలకు చేరారు. దీంతో చిన్నారులు ప్రేమకు దూరమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. వర్గల్ మండలం గౌరారం గ్రామానికి చెందిన వెల్దుర్తి మంజునాథ్ సెలూన్ నిర్వహిస్తుంటారు. భార్య కవిత వికలాంగురాలు. నయనిక(13), అక్షయ్(10) ఇద్దరు పిల్లలున్నారు. ఇల్లరికపు అల్లుడు కావడంతో అత్త భారతమ్మ వారితోనే ఉండేది. సాఫీగా సాగుతున్న ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తమ అనారోగ్యానికి తోడు అల్లుడు కూడా తీవ్రఅనారోగ్యం పాలయ్యాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం (జులై 10న) చిన్నారుల తల్లి కవిత, అమ్మమ్మ భారతమ్మ పురుగుల మందు తాగి బలవన్మరణం చెందారు. ఆ విషాదం మరవకముందే గురువారం తండ్రి మంజునాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి మృతదేహం వద్ద పిల్లల బేలచూపులు చూస్తుండటంతో చూపరులు కన్నీంటిపర్యంతమయ్యారు. వృద్ధులైన తాత శివరాములు, నానమ్మ పెంటమ్మ, బంధుగణం దుఃఖసాగరంలో మునిగిపోయారు. పదేళ్ల కుమారుడు అక్షయ్ తలకొరివి పట్టి అంత్యక్రియలు నిర్వహించి తండ్రి రుణం తీర్చుకున్నాడు. ఈ ఘటనతో గౌరారంలో విషాదం అలుముకున్నది.