
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
● ఒకేసారి ఐదు ఇళ్లల్లో చోరీ
● బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
● క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభం
నర్సాపూర్ రూరల్: తాళాలు వేసి ఉన్న ఐదు ఇళ్లల్లో దుండగులు చోరీకి పాల్పడి దొరికిన కాడికి దోచుకుపోయారు. బుధవారం అర్ధరాత్రి ఒకేసారి ఐదు ఇళ్లల్లో చోరీ జరగడం కలకలం రేగింది. ఎస్‌ఐ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలంలోని నారాయణపూర్ ప్రాంతానికి చెందిన నీరుడి స్వరూప, ఎడ్ల పోచయ్య, రొటం ప్రభాకర్, చిన్న బాలమణి, పిచ్చకుంట్ల నర్సింలు ఇళ్ల తాళాలు పగులగొట్టి చొరబడ్డారు. ఇంట్లోని బీరువాలు ధ్వంసం చేసి బంగారం, వెండి, నగదు తీసుకెళ్లారు. అయితే నీరుడి స్వరూప ఇంటికి తాళం వేసి గ్రామంలోనే ఉన్న తన కూతురు ఇంట్లో నిద్రించింది. ఆమె ఇంట్లో దొంగలు చొరబడి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, 20 వెండి గొలుసులు, రూ.60 వేల నగదు ఎత్తుకెళ్లారు. అలాగే ఎడ్ల పోచయ్య కుటుంబ సభ్యులు వేరే గ్రామానికి వెళ్లగా దొంగలు తాళం ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న 8 తులాల వెండి, రూ 16వేల నగదు దోచుకెళ్లారు. అదే విధంగా రొటం ప్రభాకర్, చిన్న బాలమణి, పిచ్చకుంట్ల నర్సింలు ఇళ్ల తాళాలు ధ్వంసం చిన్న చిన్న వస్తువులు ఎత్తుకెళ్లారు. ఒకే రోజు నారాయణపూర్‌లో తాళాలు వేసిన ఉన్న ఐదు ఇళ్లల్లో చోరీ జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎస్‌ఐ లింగం, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్‌లు క్లూస్ టీంతో దొంగతనం జరిగిన ఇళ్లను సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.