
పగలు రెక్కీ.. రాత్రి చోరీలు
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
అక్కన్నపేట(హుస్నాబాద్): పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ప్రశాంత్ నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. హుజుర్‌నగర్‌లోని శ్రీనగర్‌కాలనీకి చెందిన దంపతులు మామిడి గోపి, నాగమణి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన దంపతులు జాదవ్ గణేశ్, శిరీష కలిసి ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం, సిద్దిపేటతో పాటు ఇతర జిల్లాల్లో పలు రకాల దొంగతనాలు చేసి 25 కేసుల్లో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించారు. చోరీ చేసిన సొత్తును స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ జిల్లాలోని స్క్రాప్‌షాప్ నిర్వాహకురాలికి విక్రయించారు. వీరి వద్ద నుంచి రెండు గుడి గంటలు, బంగారు ముక్కుపుడక, వెండి అమ్మవారి పట్టీలు, రూ. 4 వేలతో పాటు వారు ఉపయోగించిన ఆటో, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. అనంతరం వీరిని రిమాండ్‌కు తరలించారు. వీరిని మండలంలోని జనగామ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా, పోలీసులను చూసి ఆటోలో పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకొని విచారించగా, పలు ఆలయాల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. ఉదయం గ్రామాల్లో చెత్త ఏరుకుంటూ ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయో చూసి, రాత్రి అయిందంటే చాలు గుడి తాళాలు పగలగొట్టి అందులో ఉన్న విలువైన వస్తువులతో పాటు హుండీలను పగలగొట్టి డబ్బులను ఎత్తుకెళ్తారు. అలాగే విలువైన వస్తువు లను అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడమే అలవాటుగా మార్చుకున్నారు.