
ఇందిరమ్మ ఇళ్లకు 8 ట్రాక్టర్ల ఇసుక
ఖేడ్‌లో ఇసుక బజార్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.5 లక్షలతోపాటు 8 ట్రాక్టర్ల ఇసుకను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని మార్కెట్ యార్డు ప్రక్కన గురువారం ఇసుక బజార్‌ను సబ్‌కలెక్టర్ ఉమాహారతితో కలిసి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఇసుక పంపిణీని ప్రారంభించారు. అంతకుముందు ఖేడ్ తహసీల్ గ్రౌండ్‌లో 69వ స్కూల్‌గేమ్ ఫెడరేషన్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ...గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదన్నారు. ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ అధికారులను సంప్రదించి ఇసుకను పొందవచ్చన్నారు. చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు కూడా ముఖ్యమని తమకు నచ్చిన ఆటల్లో నైపుణ్యాలను అలవరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, గృహనిర్మాణశాఖ పీడీ చలపతిరావు, డీఈ తివారీ, ఏఈ వంశీ, తహసీల్దారు హసీనాబేగం, క్రీడల జిల్లా ఇన్‌చార్జీ శ్రీనివాస్, జిల్లాలోని పీడీలు, పీఈటీలు, నాయకులు వినోద్‌పాటిల్, రమేశ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.