
కల్యాణం వరకు పనులు పూర్తి
మల్లన్న ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న కల్యాణం నాటికి ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఈవో టంకశాల వెంకటేశ్ తెలిపారు. గురువారం ఆలయంలో కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేశారు. దాతల సహకారంతో నిర్మించబోయే 100 వసతి గదులకు సంబంధించి ప్లాన్, ఎస్టిమేట్‌లను, మేడలమ్మ, కేతమ్మలకు బంగారు కిరీటం కోసం బంగారాన్ని ముంబైలోని ప్రభుత్వ మింట్ ద్వారా కరిగించడానికి అనుమతి కోసం దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. మల్లన్న గుట్టపై నిర్మాణం చేపడుతున్న త్రిశూలం, ఢమరుకం పనులకు నిధులు సరిపోక పోవడంతో రూ.84.15 లక్షలకు పరిపాలన అనుమతి కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. రూ.12కోట్లతో నిర్మాణం చేపడుతున్న క్యూ కాంప్లెక్స్ పనులు 70 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. బండ గుట్టపై 50 వసతి గదుల పనులు పూర్తి కావచ్చాయని, త్వరలోనే మిగతా పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రంమలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్, పర్యవేక్షకులు, సురేందర్ రెడ్డి, శ్రీరాములు, మధుకర్ పాల్గొన్నారు.