మహిళా సంఘాల్లో అమలు
వర్గల్(గజ్వేల్): సమయం ఆదా, పారదర్శకత, జవాబుదారి ధ్యేయంగా మహిళా స్వయం సహాయక సంఘాల నగదు రహిత లావాదేవీల కోసం పైలెట్ ప్రాజెక్టుగా జిల్లా నుంచి వర్గల్ మండలం ఎంపికై ంది. బుధవారం వర్గల్ సెర్ప్ కార్యాలయంలో నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, యూపిఐ పేమెంట్లు తదితర అంశాలపై అన్ని గ్రామ సంఘాల అధ్యక్షులకు, గ్రామ సంఘ సహాయకులకు కమ్యూనిటీ రిసోర్స్‌పర్సన్లు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్య, సెర్ప్ ప్రధాన కార్యాలయ బ్యాంకు లింకేజీ ప్రాజెక్టు మేనేజర్ నర్సింహస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్య మాట్లాడుతూ మహిళా సంఘాల్లో డిజిటల్ పేమెంట్స్ కోసం పైలెట్ ప్రాజెక్టుగా వర్గల్ మండలం ఎంపిక కావడం అభినందనీయమన్నారు. స్వయం సహాయక సంఘ మహిళలు ఇందుకు అనుగుణంగా తర్ఫీదుపొంది, నగదు లావాదేవీలతో మండలాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబెట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ నర్సింహస్వామి, డీపీఎం ప్రకాష్, ఏపీఎం కిరణ్ కుమార్, గజ్వేల్ ఏరియా సీబీఓ ఆడిటర్ బ్రహ్మచారి తదిరులు పాల్గొన్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా వర్గల్ మండలం ఎంపిక
ఊరూరా మహిళా సంఘాలకు శిక్షణ కార్యక్రమం