
311 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జహీరాబాద్: వికారాబాద్ జిల్లా శంకర్‌పల్లి ప్రాంతం నుంచి సేకరించిన రేషన్ బియ్యం గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తుండగా బుధవారం చిరాగ్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. చిరాగ్‌పల్లి ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామ శివారులో గల ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద 65వ జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న క్రమంలో అక్రమ బియ్యం లారీ పట్టుబడింది. అందులో 311 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం విలువ రూ.9,95,840 మేర ఉన్నట్లు నిర్ధారించారు. ఈ సందర్భంగా గుజరాత్‌కు చెందిన డ్రైవర్ రమేష్ కజారీయాను అదుపులోకి తీసుకున్నారు. చెవ్వ భాస్కర్‌తో కలిసి రమేష్‌లు శంకర్‌పల్లి ప్రాంతంలో రేషన్ వినియోగదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని అధిక ధరలకు అమ్మేందుకు గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తున్నారు. దాడుల్లో పౌరసరఫరాల శాఖ అధికారి బస్వరాజ్, పోలీసులు పాల్గొన్నారు.