
రైతులు సమన్వయం పాటించాలి
డీఏఓ స్వరూప రాణి
మిరుదొడ్డి(దుబ్బాక): రైతులకు సరిపడా యూరియా అందజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అన్నదాతలు కాస్త ఓపికతో సమన్వయం పాటించాలని డీఏఓ స్వరూప రాణి కోరారు. బుధవారం మిరుదొడ్డిలోని రైతు వేదికను ఆమె సందర్శించారు. యూరియా టోకెన్ల పంపిణీలో జరిగిన రైతుల ఆందోళన, ఫర్నీచర్ ధ్వంసంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తున్నప్పటికీ కొంత మంది కావాలని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చూడటం సరికాదన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడే రైతు వేదికలపై దాడికి పాల్పడటం విచారకరమన్నారు. ఇబ్బందులు కలగకుండా యూరియా సరఫరా చేయడానికి వ్యవసాయ అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక ఏడీఏ మల్లయ్య, మండల వ్యవసాయ అధికారి మల్లేశం, ఏఈఓలు అఖిల్, రేఖ తదితరులు పాల్గొన్నారు.