
ఖేడ్ బస్టాండ్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తా చెదారం
మున్సిపాలిటీల్లో ఘనంగా ప్రారంభించిన వందరోజుల ప్రణాళిక అంతగా ఫలితాలనివ్వలేదు. అమలులో నిర్లక్ష్యం, నిధుల లేమి, పాలనాధికారుల బదిలీలు వంటి అంశాలు ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రణాళిక అమలులో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఒకటి రెండు బల్దియాలు ఇందుకు మినహాయింపుగా నిలిచాయి. అన్ని మున్సిపాలిటీలలో వందరోజులు ప్రణాళిక ఏమేరకు సత్ఫలితాలనిచ్చిందోనని సాక్షి బృందం చేసిన పరిశీలనలో అనేక అంశాలు వెల్లడయ్యాయి.
నెరవేరని లక్ష్యం
జోగిపేట(అందోల్): మున్సిపాలిటీల్లో చేపట్టిన వంద రోజుల ప్రణాళిక మొక్కుబడిగానే సాగింది. మున్సిపాలిటీలో 20 వార్డులున్నాయి. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఈ కార్యక్రమం చేపడుతున్న సమయంలోనే కమిషనర్‌గా పనిచేస్తున్న తిరుపతి బదిలీ అయి వేరొక కమిషనర్ నియామకం, బాధ్యతల స్వీకరణ వంటి వాటితో వందరోజుల ప్రణాళిక అమలులో కొంత జాప్యం జరిగింది. దీంతో పట్టణంలోని ఓపెన్ ప్లాట్లల్లో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగి పాములు ఇళ్ల మధ్యనే సంచరించి భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అంతేకాకుండా పట్టణంలోనే ఇద్దరు పాము కాటుతో మరణించిన ఘటనలున్నాయి.
కొంతవరకే పనులు పూర్తి
నారాయణఖేడ్: వందరోజుల ప్రణాళికలో భాగంగా ఖేడ్ మున్సిపాలిటీలో చేపట్టిన కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా చేసినా మరికొన్ని ప్రాంతాల్లో సమస్యలు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. బస్టాండ్ ఆవరణలో చెత్తా చెదారంతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. ప్రధాన రహదారి వెంట పూర్తిగా తొలగించిన చెత్తకుప్పలు తిరిగి పునరావృతమవుతున్నాయి. ప్రధాన రహదారితోపాటు పలు ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో శిథిలావస్థలో ప్రమాదకరంగా మారి కూలేందుకు సిద్ధంగా ఉన్న 6 ఇళ్లను కూల్చివేశారు. నీటి క్లోరినేషన్, రహదారులపై గోతులు పూడ్చివేత పనులు పూర్తిచేశారు.
పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాం
పారిశుద్ధ్య సమస్యను చాలావరకు నివారించాం. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం చేశాం. తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాం. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించాం. – జగ్జీవన్, మున్సిపల్ కమిషనర్
మున్సిపాలిటీలో పనులు చేపట్టాం
వంద రోజుల ప్రణాళికలో భాగంగా వార్డుల్లో ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించాం. 38,328 మొక్కలను నాటాం. దోమల నివారణకు ఫాగింగ్ చేశాం. వీధి దీపాలు ఏర్పాటు చేశాం. ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు సంబంధించి రూ.5.73 కోట్ల రుణాలకు సంబంధించి లింకేజీ చేశాం. కళాశాలలో చేపట్టిన కార్యక్రమంలో మంత్రి దామోదర పాల్గొన్నారు. - రవీందర్, కమిషనర్,జోగిపేట మున్సిపాలిటీ
వంద రోజులతో ఒరిగిందేమీలేదు
పటాన్‌చెరు: వంద రోజుల ప్రణాళికతో అమీన్‌పూర్ మున్సిపాలిటీలో పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆ కార్యక్రమానికి ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయించలేదు. కొన్ని రోజులుగా ప్రత్యేకాధికారి అమీన్‌పూర్‌కు రాకపోవడం, ఆమె నిర్లక్ష్యం కారణంగా సాధారణ నిధులు కూడా విడుదల కాలేదు. అదనపు కలెక్టర్ అమీన్‌పూర్‌కు ప్రత్యేకాధికారిగా నియమితులైన తర్వాతే సింఫనీ వెళ్లే చౌరస్తా, మండే మార్కెట్ చౌరస్తా వద్ద కూడళ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేశారు. 1,273 ఇళ్లకు అసెస్‌మెంట్‌లు నిర్వహించి రూ.కోటి 23 లక్షల వసూలు చేశారు. వరద సాఫీగా వెళ్లేందుకు డ్రైనేజ్‌లను శుభ్రం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపై మురుగునీరు పొంగిపొర్లింది.
ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించాం
ప్రజల్లో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి అవగాహన కల్పించాం. ఇళ్ల వద్ద తడి పొడి చెత్త సేకరిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలకు రూ.కోట్ల నిధులు మంజూరయ్యాయి.
– జ్యోతి రెడ్డి, కమిషనర్
పారిశుద్ధ్యం పనులు అరకొర
జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో వంద రోజుల ప్రణాళిక పనులు సుమారు 90% మేర పూర్తయ్యాయి. 13 వేల నల్లా కనెక్షన్లను ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉండగా 11వేల వరకు పూర్తి చేశారు. ఆరు వ్యాటర్ ట్యాంకులను క్లీన్ చేశారు. 80% మేర శానిటేషన్ పనులు పూర్తి చేశారు. కాలువల్లో పేరుకు పోయిన మురికి, చెత్తను క్లీన్ చేయడం వంటి పనులు పూర్తయ్యాయి. అక్కడక్కడా కాలువలను పూర్తి చేసే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ట్రేడ్ లైసెన్సులను 60% మేర అందజేశారు. స్వయం సహాయక సంఘాలకు స్టాళ్లను కేటాయించారు. రోడ్లపై ఏర్పడిన గోతులను పూడ్చివేసే పనులు పూర్తి చేశారు.
లక్ష్యం మేరకు పనులు పూర్తి
వంద రోజుల ప్రణాళికలో ఇచ్చిన పనులను లక్ష్యం మేరకు పూర్తి చేశాం. పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసేలా కృషి చేయడంతో లక్ష్యాన్ని అందుకున్నాం. ఇదే స్ఫూర్తితో సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తాం.
– సుభాష్‌రావు, మున్సిపల్ కమిషనర్, జహీరాబాద్
నిధుల కేటాయింపులేవీ?
సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపాలిటీలో చేపట్టిన వంద రోజుల ప్రణాళిక నామమాత్రంగానే జరిగింది. నిధులు కేటాయించకపోవడంతో రోజువారీ పనులనే ప్రణాళికలో చేర్చి పూర్తి చేశారు. పారిశుద్ధ్య పనులు, 8,800 మొక్కలు నాటించడం, 51వేల మొక్కల పంపిణీ, 202 కుక్కలకు శస్త్రచికిత్సలు, 303 వ్యాక్సినేషన్, స్ట్రీట్ వెండర్ ఫుడ్ స్టాల్స్ ప్రదర్శన, 50ఎస్‌హెచ్‌సీ గ్రూపులకు రూ.కోటి 35లక్షల రుణాల చెక్కుల పంపిణీ, నూతన గ్రూపుల ఏర్పాటు, నాలాల్లో పూడికతీత పనులు చేపట్టారు. గుంతల పూడ్చివేత, పాతభవనాల కూల్చివేత వంటి పనులు పూర్తి చేశారు. ట్యాంకుల క్లీనింగ్, దోమల నివారణకు ఫాగింగ్ చేశారు. నల్లా కనెక్షన్లు, ట్రేడ్ లైసెన్స్‌లు మంజూరు పనులు పూర్తి చేశారు. సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించకుండా రోడ్ల పక్కనే పడేశారు. దీంతో ఎంపీడీఓ కార్యాలయం ముందు మురుగునీటి కాలువలో పేరుకుపోయి అపరిశుభ్రతకు నిలయంగా మారింది.
రోజువారీ పనులే చేపట్టాం
15 రోజుల కిందటే కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాను. రోజువారీ పారిశుద్ధ్య పనులకే ప్రాధాన్యతనిచ్చాం. ప్రతీ రోజు నిర్వహించే శానిటేషన్, ప్లాస్టిక్ వ్యర్థాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం.
– శివాజీ, మున్సిపల్ కమిషనర్
పనులు నామమాత్రంగా
సంగారెడ్డి: సంగారెడ్డిలో పారిశుద్ధ్యం పడకేసింది. వందరోజుల ప్రణాళిక పేరుతో చేపట్టిన చర్యలు ఫలితాలనివ్వలేదు. వివిధ విభాగాల మధ్య సమన్వయం లోపంతో ఎక్కడ ఏ పని చేపట్టి పూర్తి చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలోపం కారణంగా పనులు నామమాత్రంగానే పూర్తయ్యాయి. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన 11 భవనాలను కూల్చివేశారు. అయితే మున్సిపాలిటీలో మొత్తంగా 80 వరకు శిథిలావస్థకు చేరిన పాతభవనాలను గుర్తించారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతోనే వీటి జోలికి పోలేదన్న విమర్శలున్నాయి.
స్వచ్ఛ సంగారెడ్డికి ప్రయత్నిస్తా
స్వచ్ఛత విషయంలో సంగారెడ్డి మున్సిపాలిటీని నంబర్‌వన్‌గా తయారు చేసేందుకు కృషి చేస్తా. ప్రణాళిక పనులపై సమగ్ర విచారణ చేశాకే బిల్లులు చేస్తాం.
– శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్

జోగిపేట వాసవీనగర్ లోని చెత్త వద్ద పందులు