
మహిళా రైతు ఎర్కొల్ల సత్తమ్మ
పరిష్కార ప్రక్రియ తిరిగి తహసీల్దార్ నుంచి ప్రారంభం
సీసీఎల్‌ఏ స్థాయికి వెళ్లినఫైళ్లన్నీ వెనక్కి..?
కొనసాగుతున్న భూసమస్యల కష్టాలు
కలెక్టరేట్‌లో భూభారతి సహాయ కేంద్రం వద్ద ఉన్న ఈ మహిళా రైతు పేరు ఎర్కొల్ల సత్తమ్మ. ఈమెది ఝరాసంఘం మండలం ఎల్గొయి గ్రామం. ఈమెకు 2 ఎకరాల 13 గుంటల భూమి ఉంది. ధరణి పోర్టల్‌లో 23 గుంటలకు మాత్రమే పట్టాదారు పాసుపుస్తకం రాగా, మిగిలిన ఎకరం 30 గుంటల భూమికి సంబంధించిన పాసుపుస్తకం కోసం 2022 నుంచి అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతోంది. ఈ మిస్సింగ్ సర్వే నంబర్ కేటగిరీకి చెందిన దరఖాస్తులను పరిష్కరించే అధికారం ధరణి పోర్టల్‌లో సీసీఎల్‌ఏ కార్యాలయానికే ఉండేది. ఈ దరఖాస్తుకు సంబంధించిన స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ ఇచ్చిన నివేదికలు.. ఇన్నాళ్లు సీసీఎల్‌ఏ వద్ద పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు భూభారతి వచ్చాక ఈ మిస్సింగ్ సర్వే నంబర్‌ను సరిచేసే అధికారం కలెక్టర్లకు ఇచ్చారు. దీంతో ఈ ప్రక్రియంతా తిరిగి తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రారంభం కావాల్సి ఉందని, అక్కడి నుంచి మళ్లీ నివేదికలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : భూసమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూభారతి పోర్టల్‌లో కొన్ని మాడ్యూల్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం ప్రక్రియ మళ్లి మొదటి కొచ్చింది. ఇప్పటికే ధరణి పోర్టల్ ఉన్న తహసీల్దార్లు ఇచ్చిన నివేదికలతో కూడిన ఫైళ్లు పక్కన బెట్టాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. కొన్ని కేటగిరీలకు చెందిన దరఖాస్తుల ప్రక్రియను తిరిగి తహసీల్దార్ స్థాయి నుంచి ప్రారంభిస్తున్నామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతో బాధిత రైతులు కష్టాలు తప్పడం లేదు. మిస్సింగ్ సర్వే నంబర్‌తోపాటు, ఆర్‌ఎస్‌ఆర్ వేరియేషన్స్ వంటి మాడ్యుల్‌లలోని భూసమస్యలను తిరిగి తహసీల్దార్‌స్థాయి నుంచి ప్రక్రియప్రారంభిస్తున్నారు.
సుమారు 2 వేలకు పైగా ఇలాంటి దరఖాస్తులే..
ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా తెచ్చిన భూభారతి అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రైతుల నుంచి తిరిగి దరఖాస్తులు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 604 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో మొత్తం 13,897 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో తిరిగి తహసీల్దార్ నుంచి ప్రక్రియ ప్రారంభం కావాల్సిన కేటగిరీల దరఖాస్తులు సుమారు రెండు వేలకు మించి ఉంటాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
రైతులకు అవే తిప్పలు
భూభారతి వచ్చినా రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. తమ భూసమస్యల పరిష్కారం కోసం వారు చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఈ భూసమస్యల పరిష్కారం కోసం వచ్చిన రైతులే అధికంగా ఉంటున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్ వంటి సుదూర ప్రాంతాల నుంచి సైతం రైతులు కలెక్టరేట్‌కు వస్తున్నారు. తీరా ఇక్కడి వచ్చాక వారికి ఫైల్ తహసీల్దార్ల వద్ద ఉందని అధికారులు చెప్పి పంపుతున్నారు. భూభారతి సహాయ కేంద్రానికి వెళ్లి తమ దరఖాస్తు పరిష్కారం ఎంత వరకు వచ్చిందని ఆరా తీసి నిరాశగా ఇంటికి వెళుతున్నారు.