
తప్పని యూరియా తిప్పలు
హత్నూర, దౌల్తాబాద్‌లో యూరియా కోసం రైతుల క్యూ
రోజుల తరబడి నిరీక్షణ
హత్నూర(సంగారెడ్డి): యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. పనులు మానుకుని రోజుల తరబడి పడిగాపులు కాసినా యూరియా దొరకడం కష్టంగానే ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రమైన హత్నూర సొసైటీ కార్యాలయం, దౌల్తాబాద్‌లోని ఎరువుల దుకాణాల వద్ద యూరియా కోసం ఉదయం నుంచి ఆయా గ్రామాలకు చెందిన రైతులు ఆధార్ కార్డులు పెట్టి ఎదురు చూశారు. బుధవారం సుమారు 90 మెట్రిక్ టన్నుల యూరియా (2000 బస్తాలు) రావడంతో ఒక్కసారిగా దుకాణాల ముందు ఎగబడ్డారు. ఆధార్ కార్డుకు ఒక రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే పంపిణీ చేశారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి వరుసలో నిలబెట్టారు. అయినా కొంతమందికి సరిపడా యూరియా దొరకలేదు. వరి పత్తి సాగు చేసి నెలలు గడిచిపోయిన యూరియా అవసరమున్నంత మేర దొరకకపోవడంతో పంటలు ఎదగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి హత్నూర మండలం రైతులకు అవసరం ఉన్న యూరియాను సరఫరా చేయాలని వేడుకున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావును సంప్రదించగా ఇప్పటికీ సుమారు 1,700 మెట్రిక్ టన్నుల యూరియా మండలానికి వచ్చిందని మరో రెండు రోజుల్లో హత్నూర సొసైటీ సిరిపురం ఎరువుల దుకాణానికి రానుందని తెలిపారు. ఇంకా సుమారు 300 మెట్రిక్ టన్నుల యూరియా మండలానికి అవసరం ఉందని ప్రతిపాదనలు నివేదించామని వివరించారు.