
నూతన భవనం కోసం స్థల పరిశీలన
● అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ● కూలిన హాస్టల్ పైకప్పు శిథిలాల తొలగింపు ● పనులు పర్యవేక్షిస్తున్న తహసీల్దార్
మునిపల్లి(అందోల్): లింగంపల్లి గురుకుల పాఠశాల, హాస్టల్ నూతన భవనం కోసం స్థల పరిశీలన చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మండలంలోని లింగంపల్లిలో మంగళవారం కూలిపోయిన గురుకుల పాఠశాల, హాస్టల్ భవనాన్ని ఆయన పరిశీలించారు. కూలిన శిథిలాల తొలగింపు పనులను తహసీల్దార్ గంగాభవానీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ...కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులు ఎంత త్వరగా పూర్తయితే అంతే వేగంగా హాస్టల్‌కు నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభిచే అవకాశముందన్నారు. అయితే కూలిన స్థలంలోనా లేక కొత్త స్థలంలో నిర్మించడమా అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వారిని మరో భవనంలోకి తరలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీశ్‌కుమార్, మైనార్టీ సీనియర్ నాయకులు మక్సూద్ పటేల్, ప్రిన్సిపాల్ చైతన్య, తహసీల్ధార్ గంగాభవాని, పంచాయతీ ఈఈ మనీష్, ఇన్‌చార్జి శ్రీనాథ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.