
బాధితులకు న్యాయం జరగాలి
పటాన్‌చెరు టౌన్: సిగాచి పరిశ్రమ బాధితులకు న్యాయం జరగాలని, ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ముత్తంగిలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో టీపీజేఏసీ కన్వీనర్ అశోక్ కుమార్, సైంటిస్ట్ ఫర్ పీపుల్స్ వ్యవస్థాపకులు బాబూరావు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు పలువురు మేధావులు, వక్తలు, బాధిత కుటుంబ సభ్యులు, కార్మిక సంఘం నాయకులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమ బాధలను పంచుకున్నారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ...సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు. యాజ మాన్య తప్పిదం తోనే ప్రమాదం జరిగినట్లు నిపుణులు చెప్తున్నారని తెలిపారు. పోలీసులు యాజమాన్యంపై కేసు నమోదు చేసినా ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం సరి కాదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై కేసులు పెట్టి దొరికిన వారిని అరెస్టు చేసిన ప్రభుత్వాలు ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యాలపై మరొకలా వ్యవహరించడం ఏం నీతని నిలదీశారు. కార్మికుల సజీవ దహనానికి కారణమైన యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలతోపాటు పౌర సమాజం ఈ ప్రమాదం నుంచి గుణ పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నిర్మాణాత్మక శైలిలో నిబంధనలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్మిక సంఘాలతోపాటు నిపుణులు, మేధావులు ఒకతాటిపై వచ్చి ప్రణాళిక సిద్ధం చేసి సీఎంను కలిసి వివరిద్దామని తెలిపారు. సంఘటన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి మృతిచెందిన కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారంతోపాటు గాయపడిన క్షతగాత్రులకు రూ.పది లక్షల పరిహారం ప్రకటించారని వెంటనే ఆ పరిహారాన్ని చెల్లించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ధూళితోనే ఇంత పెద్ద ప్రమాదం: బాబూరావు
సిగాచి పరిశ్రమ నిర్లక్ష్యం, కాలం చెల్లిన మెషీనరీతో అవగాహన లేని కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేయించడం, పరిశ్రమలో తయారుచేసే మిశ్రమం నుంచి వచ్చిన ధూళితోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని సైంటిస్ట్ ఫర్ పీపుల్స్ వ్యవస్థాపకులు బాబూరావు తేల్చిచెప్పారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికులకు రూ.కోటితో పాటు గాయపడ్డ క్షతగాత్రులకు రూ.పదిలక్షల నష్టపరిహారం ప్రకటించినా ఇప్పటివరకు కార్మికులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదన్నారు. పక్క రాష్ట్రంలో ప్రమాదం జరిగిన వారం రోజుల్లోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ.కోటి, గాయపడ్డ వారికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తే తెలంగాణలో మాత్రం కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అడ్వొకేట్ వసుదా నాగరాజు సహకారంతోనే హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో బాధితులందరికీ న్యాయం జరిగే వరకూ విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు. పరిశ్రమల్లో కార్మిక భద్రత గురించి ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సిగాచిపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రొఫెసర్ కోదండరామ్
బాధిత కుటుంబ సభ్యుల సమస్యలు చెబితే సీఎం దృష్టికి తీసుకువెళ్తా
ప్రకటించిన పరిహారం త్వరగా చెల్లించండి