ఆర్డీఓ రవీందర్‌ ఆకస్మిక బదిలీ | - | Sakshi
Sakshi News home page

ఆర్డీఓ రవీందర్‌ ఆకస్మిక బదిలీ

Sep 10 2025 7:35 AM | Updated on Sep 10 2025 10:18 AM

ఆర్డీఓ రవీందర్‌ ఆకస్మిక బదిలీ

ఆర్డీఓ రవీందర్‌ ఆకస్మిక బదిలీ

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్‌రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీ ఇప్పుడు రెవెన్యూశాఖతోపాటు, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఆందోల్‌ ఆర్డీఓగా పనిచేస్తున్న పాండుకు సంగారెడ్డి ఆర్డీఓగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. రవీందర్‌రెడ్డికి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రవీందర్‌రెడ్డి చాలా కాలంగా సంగారెడ్డి జిల్లాలో పాతుకుపోయారు. గత బీఆర్‌ఎస్‌ హయాంలో కూడా ఆయన సంగారెడ్డి ఆర్డీఓగా పనిచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఆయనను జహీరాబాద్‌ నిమ్జ్‌ భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్‌గా లూప్‌లైన్‌ పోస్టుకు బదిలీ చేశారు. అక్కడ కొద్దిరోజులే పనిచేసిన రవీందర్‌రెడ్డి తిరిగి సంగారెడ్డి ఆర్డీఓగానే పోస్టింగ్‌ తెచ్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు పది నెలలుగా ఆర్డీఓగా పనిచేస్తున్న రవీందర్‌రెడ్డిని ఇప్పుడు ఆకస్మికంగా బదిలీ చేయ డం జిల్లా అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన బదిలీని నిలిపివేసుకునేందుకు రవీందర్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచా రం రెవెన్యూశాఖ వర్గాల్లో జరుగుతోంది. ఇందుకోసం జిల్లాలోని అధికార కాంగ్రెస్‌ పార్టీలోని కీలక ప్రజాప్రతినిధులను, నేతలను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో..

జిల్లాలో రూ.వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. నేతలు, ప్రజాప్రతినిధుల బినామీలు ఈ భూములను చెరబట్టారు. మరోవైపు వందలాది ఎకరాల్లో అసైన్డ్‌ భూములు చేతులు మారాయి. నిబంధనలకు విరుద్ధంగా ఈ అసైన్డ్‌ భూములను రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రధానంగా హెచ్‌ఎండీఏ పరిధిలోని మండలాలు..పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్‌, జిన్నారం, గుమ్మడిదల, కంది, సంగారెడ్డి, కొండాపూర్‌, సదాశివపేట వంటి మండల్లాలో విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోనూ ఆయన సంగారెడ్డి ఆర్డీఓగా చాలాకాలం పనిచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఆయనకు బదిలీ జరిగినా తిరిగి సంగారెడ్డి ఆర్డీఓ పోస్టుకే చేరుకున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుని కీలక పోస్టింగ్‌లను దక్కించుకుంటారనే విమర్శలు రవీందర్‌రెడ్డిపై ఉన్నాయి.

ఇన్‌చార్జిగా ఆందోల్‌ ఆర్డీఓపాండుకు బాధ్యతలు

పలు భూ వివాదాలే కారణమా?

పైరవీకారులకు నిలయం!

సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం పైరవీకారులకు నిలయంగా మారిందనే విమర్శలున్నాయి. సాధారణ ప్రజలు, నిరుపేద రైతులు తమ పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తే కనీసం పట్టించుకోని ఈ కార్యాలయం అధికారులు, పైరవీకారులకు మాత్రం పెద్ద పీట వేస్తారనేది సాధారణ విషయమేననే అభిప్రాయం ఉంది. బడాబాబులు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల పనులను వెంట వెంటనే చేసి పెట్టే ఈ అధికారులు, సాధారణ రైతులను, నిరుపేదలను మాత్రం చెప్పులరిగేలా తిప్పుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement