
ఒక్క క్షణంలో.. అంతా శూన్యం!
సంగారెడ్డి క్రైమ్: చిన్న సమస్యను అధిగమించలేక కొంత మంది యువత ఒక క్షణం ఆలోచించకుండా ఉరి తాడును వెతుక్కతున్నారు. క్షణికావేశంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేక పురుగుల మందు తాగి అసువులు బాసుతున్నారు. అప్పులు, కుటుంబ సమస్యలు, మోయలేని చదువు భారం, ఉద్యోగం రాలేదని నిరుద్యోగి, ప్రేమ విఫలమైందని, టీచర్, తల్లిదండ్రులు మందలించారని ఇలా అనేక మంది చిన్నచిన్న కారణాలతో జిల్లాలో ఎక్కడో చోట నెలకొక్కరూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. యువతీ యువకులు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించుకోవాలి. ఏ సమస్యకై నా ఆత్మహత్య పరిష్కారం కాదని నిపుణులు అంటున్నారు.
కుటుంబం, సన్నిహితుల బాధ్యత ఇది
తమ కుటుంబ సభ్యులు, లేదా స్నేహితులతో చర్చిస్తే పరిష్కార మార్గాలు లభిస్తాయి. కానీ అవేమీ ఆలోచించకుండా చాలామంది చావు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో వారి జీవితం అర్థంతరంగా ముగిసిపోతుంది. వారిపై ఆధారపడిన పిల్లలు తల్లిదండ్రులు భార్య రోడ్డున పడుతున్నారు. భార్యాభర్తల్లో ఒకరు లోకం వీడితే రెండో వ్యక్తి కుంగుబాటుకు గురవుతారు. వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఎవరైనా తాను బతకనని, కుటుంబానికి బరువయ్యా అని చెబితే తేలికగా తీసుకోవద్దు.
నువ్వులేని ఇంటిని జీవితాన్ని ఊహించుకోండి అంటూ చాలామంది మానసిక వేదనను వెలిబుచ్చుతారు. వారిని మార్చే దిశగా ప్రయాత్నం చేయకపోతే కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే.. వ్యాయామం అలవాటు చేయడం ద్వారా కొంత మార్పు ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో గడిచిన ఎనిమిది నెలల్లో దాదాపు 140 మంది వివిధ కారణాలతో తమ ప్రాణాలు తీసుకున్నారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన మహిళ మే నెల 29న ఆత్మహత్య చేసుకుంది. తన తల్లి మందలించిందని క్షణికావేశంలో బలవన్మరణానికి పాడింది. దీంతో ఆమె ఐదేళ్ల పాప అనాథ అయ్యింది. అలాగే.. పుల్కల్ మండలానికి చెందిన యువకుడు కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా జిల్లాలో రోజుకొకి బలవన్మరణం ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటోంది.
చిన్న కారణాలతో యువత బలవన్మరణం
జిల్లాలో నెలకొకరు చొప్పున ఆత్మహత్య
మానసిక స్థితిని గమనించి, ధైర్యం చెప్పాలి
మానసిక నిపుణుల సూచన
ఇలా అరికట్టవచ్చు..
వైద్యనిపుణుల ప్రకారం.. ఆత్మహత్యకు పాల్పడాలనుకునేవారు ఒంటరిగా ఉంటారు. వెంటనే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చు. డయల్ 100కు కాల్ చేస్తే పోలీసులు స్పందిస్తారు. మహిళల కోసం 181కు కాల్ చేస్తే సఖీ కేంద్రం సిబ్బంది ఇంటికొచ్చి కౌన్సెలింగ్ ఇస్తారు. పిల్లలకై తే 1098కి సమాచారం ఇవ్వాలి.