
మీరెందుకు నివాసం ఉండటం లేదు
జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని డబుల్‌బెడ్ రూంలను అద్దెలకు ఇచ్చారని, కొంతమంది విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలపై రెవెన్యూ అధికారులు 120 మందికి నోటీసులు జారీ చేశారు. తమకు కేటాయించిన డబుల్‌బెడ్ రూం ఇళ్లల్లో ఎందుకు నివాసం ఉండటం లేదు అన్న విషయమై మూడు రోజుల్లో లబ్ధిదారులు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులను తాళం వేసి ఉన్న గదులకు అతికించారు. ఈ విషయం తెలుసుకున్న లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాము డబుల్‌బెడ్ రూం ఇళ్లల్లోనే ఉంటున్నామంటూ లిఖిత పూర్వకంగా రెవెన్యూ అధికారులకు అందజేశారు.
తహసీల్దారు, ఆర్డీఓ కార్యలయం
ఎదుట ఆందోళన
డబుల్‌బెడ్ రూం ఇళ్ల వద్ద ఉద్దేశపూర్వకంగానే అధికారులు నోటీసులు అతికించారని సీఐటీయూ నాయకులు విద్యాసాగర్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పి.నారాయణ, రఫీక్ ఆరోపించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేసిన అనంతరం లబ్ధిదారులతో కలిసి ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. తాము లేని సమయంలోనే నోటీసులు అతికించారని పలువురు లబ్ధిదారులు సూచించారు.
120 మంది డబుల్ బెడ్‌రూం లబ్ధిదారులకు నోటీసులు
తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళన
తిరిగి విచారణ జరిపిస్తాం: ఆర్డీఓ
మళ్లీ విచారణకు ఆర్డీఓ ఆదేశం
డబుల్‌బెడ్ రూం ఇళ్లను అద్దెకు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై తిరిగి విచారణ జరిపిస్తామని ఆర్డీఓ పాండు సూచించారు. వాస్తవంగా డబుల్‌బెడ్ రూం ఇళ్లల్లో నివాసం ఉంటే ఇబ్బంది లేదని, తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నామని చె ప్పారు. డబుల్‌బెడ్ రూం ఇళ్లను అమ్ముకున్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.