
బైకును ఢీకొట్టిన కంటైనర్
● యువకుడు మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు
పటాన్‌చెరు టౌన్: స్నేహితుడితో కలిసి వెళ్తుండగా బైకును కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడికి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అభిమాన్ సింగ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా చిన్న శంకర్‌పల్లికి చెందిన భాను ప్రకాష్ (25)ఎలక్ట్రిషియన్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అతని స్నేహితుడు బల్వంత్ రెడ్డితో కలిసి భోజనం చేసేందుకు బైక్‌పై ముత్తంగి బయలుదేరారు. ఈ క్రమంలో శివారులోకి రాగానే అర్ధరాత్రి కంటైనర్ వీరి బైక్‌ని ఢీ కొట్టింది. బైక్‌పై ఉన్న భాను ప్రకాశ్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బల్వంత్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి విజయ మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బస్సును ఢీకొన్న కారు: ఇద్దరికీ గాయాలు
అల్లాదుర్గం(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి ఈ ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని 161 జాతీయ రహదారి రాంపూర్ గ్రామం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై శంకర్ వివరాల ప్రకారం... సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పిట్లం వైపు వెళుతుంది. రాంపూర్ గ్రామం వద్ద ప్రయాణికులను దింపేందుకు బస్సు ఆపారు. వెనుక నుంచి పిట్లం వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పిట్లంకు చెందిన సాయి, స్నేహిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని అంబులెన్‌న్స్‌లో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సును కారు ఢీకొట్టడంతో పూర్తిగా నుజ్జునుజ్జైంది.