
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
చిట్టోజిపల్లిలో రైతు..
చేగుంట(తూప్రాన్): ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ వైర్ సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చిట్టోజిపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తలారి గోవర్ధన్(32) మంగళవారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్ సరఫరా కాకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ వైర్ పోయిందని గుర్తించి వైరు సరి చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో గోవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.
చిట్కుల్‌లో యువకుడు..
చిలప్‌చెడ్(నర్సాపూర్): విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చిట్కుల్ గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ నర్సింహులు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కామగోల్ల శివకుమార్(28) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా గ్రామానికి చెందిన కొండారెడ్డి పొలం గట్లపై గడ్డి పెరగడంతో యంత్రంతో గడ్డి కోసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలం గట్టుపై బోరుమోటార్‌కు కనెక్షన్ ఉన్న సర్వీస్ వైరును గమనించని అతడు వైరును కూడా కట్ చేయగా విద్యుత్ షాక్‌కు గురై పొలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నర్సింహులు, ఇన్‌చార్జ్ విద్యుత్‌శాఖ ఏఈ సల్మాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా మృతుడికి నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది.

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి