
పత్తికి టెం‘డర్’ కత్తి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఈసారి పత్తిని విక్రయించడంలో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లుల లీజుకు సంబంధించిన టెండరు ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో జిల్లాలో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సీసీఐ కొత్తగా తెరపైకి తెచ్చిన నిబంధనల కారణంగా ఒక్క జిన్నింగ్ మిల్లు యజమాని కూడా ఈ టెండరు ప్రక్రియలో పాల్గొనలేదు. ఈ కొత్త నిబంధనలతో జిన్నింగ్, ప్రెస్సింగ్ ప్రక్రియ నిర్వహించడం తమతో సాధ్యం కాదని ఆయా మిల్లుల యాజమాన్యాలు టెండరు ప్రక్రియకు దూరంగా ఉన్నాయి. దీంతో ఈసారి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యంగా ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. ఏటా అక్టోబర్ తొలి వారం నుంచి రైతులు పత్తి తీయడం షురూ చేస్తారు. అదే నెల 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి ఆలస్యమయ్యే అవకాశముండటంతో ఈ విషయంపై నేడో రేపో జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నేతలు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో సమావేశం కావాలని నిర్ణయించారు.
దళారులను ఆశ్రయించక తప్పదా..?
సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులను లీజుకు తీసుకుంటుంది. అందులో పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్ చేసి బెయిళ్లుగా మార్చుకుంటుంది. అయితే సీసీఐ కొత్తగా తెరపైకికి తెచ్చిన నిబంధనల కారణంగా సీసీఐకు మిల్లు ఇచ్చేందుకు ఒక్క యజమాని కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేదు. దీంతో సీజను ప్రారంభమయ్యాక కొన్న పత్తిని ఎక్కడికి తరలించాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితి చక్కదిద్దకపోతే రైతులు తమ పత్తిని దళారులు, ప్రైవేటు వ్యాపారులకే పత్తిని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడి..కనీస మద్దతు ధర ప్రశ్నార్థకంగా మారనుంది.
లింట్, సీడ్ నిబంధనల విషయంలో..
ముడి పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్ చేశాక సీసీఐకి ఇవ్వాల్సిన పత్తి, గింజల శాతం విషయంలో ఈసారి నిబంధనలు మారాయి. తరుగు శాతం విషయంలో పెట్టిన నిబంధన మేరకు జిన్నింగ్, ప్రెస్సింగ్ చేయడం తమకు ఇబ్బందిగా ఉందని జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నాయకులు పేర్కొటున్నారు. ఈ నిబంధనలతో జిన్నింగ్, ప్రెస్సింగ్ చేయడం సాధ్యం కాదని, అందుకే టెండరు ప్రక్రియకు దూరంగా ఉంటున్నామని చెబుతున్నారు.
19 చోట్ల
కొనుగోలు కేంద్రాలు..
● సీసీఐ ఏటా సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కలిపి మొత్తం 19 చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. సదాశివపేట, జోగిపేట, రాయికోడ్, వట్‌పల్లి, నారాయణఖేడ్, పాపన్నపేట (మెదక్ జిల్లా)లో ఈ కేంద్రాలు ఉంటాయి.
● సంగారెడ్డి జిల్లాలో ఈ ఖరీఫ్ సీజనులో మొత్తం 7.28 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 3.48 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఎకరానికి సుమారు 7.5 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినా..సుమారు 26 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అనధికారిక అంచనా.
● మెదక్ జిల్లాలో 3.47 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇందులో 34,720 ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఈ జిల్లాలో సుమారు 2.60 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి ఉంటుందని అంచనా.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశం!
విక్రయాలకు పొంచి ఉన్న ముప్పు
సీసీఐకి జిన్నింగ్ మిల్లులు ఇచ్చేందుకు విముఖత
టెండరు ప్రక్రియకు దూరంగా యాజమాన్యాలు