
సమస్యల పరిష్కారంపై దృష్టి
● కలెక్టర్ ప్రావీణ్య
● ప్రజావాణికి 61 అర్జీలు
సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి వహించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు ప్రజలనుంచి 61 అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులతో మొరపెట్టుకున్నారు. భూ సమస్యలతో పాటు, పింఛన్లు, సంక్షేమ పథకాలు తదితర వాటిపై దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రహదారుల్లేని తండాలను గుర్తించాలి
జిల్లాలో రహదారులు లేని తండాలను గుర్తించి, నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో రహదారుల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులను వినియోగించి పీడబ్ల్యూడీ రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. రహదారుల నిర్మాణాలకు సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభించాలన్నారు.