
‘బెస్ట్ అవైలబుల్’ బిల్లులు చెల్లించాలి
పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సురేశ్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్‌లో ఉన్న రూ.200 కోట్లను తక్షణమే చెల్లించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సురేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు సంగారెడ్డిలోని ఐటిఐ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ...బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు మాత్రమే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ప్రైవేట్ స్కూళ్లలో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల కాకపోవడంతో ఫీజులు కట్టాలని విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థులకు ఫీజు బకాయిలను విడుదల చేయని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.