
ఇల్లు కట్టు.. ఫొటో పెట్టు
లబ్ధిదారులకు తప్పనున్న కష్టాలు
వారి ఇల్లుకు వారే అధికారులు
‘టీజీహెచ్‌సీఎల్’ యాప్‌లో ఫొటోల అప్‌లోడ్
సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం.. మరింత పారదర్శకంగా మారింది. ఇకపై అధికారులు ఫొటోలు తీయకుండానే, లబ్ధిదారులే యాప్ ద్వారా ఇళ్ల ఫొటోలు అప్‌లోడ్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఆ ఫొటోలను పరిశీలించి, వాటి ఆధారంగా బిల్లు విడుదల చేయనున్నారు. సకాలంలో ఆర్థిక సహాయం అందుతుంది. ఈ యాప్ వినియోగం ఈ నెల 4 నుంచి అమల్లోకి వచ్చింది.
అధికారుల అవసరం లేకుండానే..
ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం జరుగుతున్న క్రమంలో అధికారులే వివిధ స్థాయిలలో ఫొటోలు తీశారు. హౌసింగ్ ఏఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి ఫొటోలు తీసేవారు. దీంతో లబ్ధిదారులకు బిల్లులు రావడంలో ఆలస్యం అవుతుంది. ప్రస్తుత నూతన యాప్ ద్వారా సకాలంలోనే డబ్బులు అందనున్నాయి. లబ్ధిదారులే తమ ఇళ్ల నిర్మాణాల ఫొటోలు నేరుగా ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేసుకోనున్నారు. అధికారులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వ సాయం అందనుంది.
పథకం అమలు విధానం
మొదటి దశలో ముగ్గులు పోసి.. బేస్మెంట్ నిర్మించిన తర్వాత డబ్బులు జమ చేస్తారు. గోడలు నిర్మించిన ఫొటోలు పంపిన తర్వాత రెండో సారి.. పైకప్పు పూర్తయిన తర్వాత మూడో విడత డబ్బులు వస్తాయి. చివరగా ప్రారంభం అనంతరం చివరి బిల్లు వస్తుంది.
ఫొటోల అప్‌లోడ్ ఇలా..
పారదర్శకత కోసమే..
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అందించేందుకు ఈ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇల్లు నిర్మించుకునే వారు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి. యాప్‌పై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి సాంకేతిక సమస్య ఎదురైనా టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు.
– జయదేవ్‌ఆర్యా, హౌసింగ్ పీడి, సిద్దిపేట
ఇందిరమ్మ ఇళ్ల పథకం.. మరింత పారదర్శకం