
కుంగిన కాళేశ్వరంతో మూసీకి నీళ్లెట్లొస్తాయి?
● సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి ● బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ
సిద్దిపేటజోన్: కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీ ప్రక్షాళనకు గోదారి నీళ్లు ఎలా వస్తాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ప్రశ్నించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.7500 కోట్లతో మూసీ ప్రక్షాళన కోసం పథకం రూపకల్పన చేసిందన్నారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి గండిపేట వద్ద శంకుస్థాపనకు ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. మల్లన్న సాగర్ దండగ ప్రాజెక్టు వృథా అని ఆరోపణలు చేసిన సీఎం మల్లన్న సాగర్ నుంచి 250 టీఎంసీల నీళ్లు హైదరాబాద్‌కు పంపింగ్ చేసేలా ప్రణాళికలు తయారు చేసినట్టు ఆరోపించారు. శంకుస్థాపన కంటే ముందు కొమరవెల్లి మల్లన్న దేవాలయంలో తప్పు ఒప్పుకుని కేసీఆర్, తెలంగాణ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై సీబీఐ విచారణకు సూచనలు చేసిందని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోహన్‌లాల్, నాయకులు శ్రీహరి, శ్రీనివాస్,ఎల్లారెడ్డి, ప్రభాకర్ వర్మ పాల్గొన్నారు.