
ఇళ్ల నిర్మాణాలకు అనుమతివ్వాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం
కొండాపూర్(సంగారెడ్డి): ఇళ్ల స్థలాల పొజిషన్ కలిగి పట్టా సర్టిఫికెట్లు ఉన్న వారికి ఇంటి నిర్మాణాలకు అనుమతివ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కొండాపూర్‌లోని తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల పరిధిలోని గంగారంలో సర్వే నంబర్ 1,5,243లోని ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు సుమారు 100 మందికి రెండేళ్ల క్రితం ప్రభుత్వాధికారులు ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చి పొజిషన్ చూపెట్టారన్నారు. గత రెండేళ్లుగా ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్లు ఇవ్వాలని కోరగా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ఆందోళన చేయాల్సి వస్తుందని తెలిపారు. అధికారులిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీనికి తహసీల్దార్ స్పందిస్తూ మంగళవారం గంగారంలో పర్యటించి అనుమతులు వచ్చేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రాజయ్య, మండల కమిటీ సభ్యులు బాబూరావు తదితరులు పాల్గొన్నారు.