
పల్లెలకు పాలనాధికారులు
జిల్లాకు 239 మంది నియామకం
జహీరాబాద్ టౌన్: జిల్లాకు కొత్తగా 239 మంది గ్రామ పరిపాలనాధికారులను ప్రభుత్వం నియమించింది. ఈనెల 5వ తేదీన హైదరాబాద్‌లో వారంతా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్న విషయం తెలిసిందే. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఈ నియామకాలు చేపట్టింది. గత ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఏఓ వ్యవస్థను రద్దు చేసి వారిని వివిధ శాఖలకు బదిలీ చేసింది. జీపీఓలుగా విధులు నిర్వర్తించడానికి ఆసక్తి చూపిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏలకు రెండు విడతల్లో రాత పరీక్షలు నిర్వహించి 239 మందిని ఎంపిక చేసింది. సంగారెడ్డి క్లస్టర్ నుంచి 123, జహీరాబాద్ నుంచి 54, నారాయణఖేడ్ నుంచి 41, ఆందోల్ క్లస్టర్ నుంచి 21 మంది ఎంపికయ్యారు. వీరికి త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. గ్రామ పాలనాధికారుల నియామకంతో ప్రజలకు సత్వర సేవలు అందుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు అయిన తర్వాత రెవెన్యూకు సంబంధించిన విషయాలను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్లు, భూమి హక్కులు తదితర సేవలు ఇక గ్రామాల్లో అందుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.