
అద్దె భవనంలో అవస్థలు
జహీరాబాద్ టౌన్: సీపీడీఓ కార్యాలయంలో కనీస వసతులు కరువయ్యాయి. సమావేశాలు నిర్వహించిన ప్రతీసారి అంగన్‌వాడీ కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీలను నియమించింది. జహీరాబాద్, న్యాల్‌కల్, ఝరాసంగం, కోహీర్, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలాలకు కలిపి ప్రాజెక్టు కార్యాలయాన్ని జహీరాబాద్‌లో ఏర్పాటు చేశారు. జహీరాబాద్ ప్రాజెక్టు కింద 407 మంది అంగన్‌వాడీలు, 17 మంది సూపర్‌వైజర్లు పనిచేస్తున్నారు. వీరికి సూచనలు, సలహాలిచ్చేందుకు ప్రతి నెల సమావేశాలు నిర్వహిస్తారు. ఇందుకు సరిపడా స్థలం లేక రైతు వేదిక, ఫంక్షన్‌హాల్, చెట్ల నీడలో నిర్వహిస్తున్నారు. సొంత భవనం నిర్మించాలన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం రూ. 30 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ భవన నిర్మాణానికి స్థలాన్ని సకాలంలో కేటా యించకపోవడంతో నిధులు రద్దయ్యాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పరిశీలించిన తర్వాత ఎట్టకేలకు పస్తాపూర్ వద్ద స్థలం కేటాయించారు. స్థలం ఎంపిక చేపట్టిన తర్వాత నిధులు లేవు. ప్రస్తుతం నిధుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే విషయమై సీడీపీఓ అంజమ్మను వివరణ కోరగా, భవన నిర్మాణం గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, మంత్రి దామోదరకు కూడా వినతిపత్రం ఇచ్చామని తెలిపారు.
సీపీడీఓ కార్యాలయంలో వసతులు కరువు