
మా బార్.. మా ఇష్టం
● అర్ధరాత్రి దాటాక కూడా అమ్మకాలు ● మందుబాబులకు అడ్డాగా సంగారెడ్డి! ● పట్టించుకోని అధికారులు
సంగారెడ్డి: మందుబాబులకు సంగారెడ్డి అడ్డాగా మారిందా అంటే అవుననే అనిపిస్తోంది. నిర్దేశిత సమయం తర్వాత మూసేయాల్సిన బార్లు అర్ధరాత్రి దాటినా తెరిచి ఉంచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నాయి. ఇక టిఫిన్ సెంటర్లు, ధాబాలు కూడా అర్ధరాత్రి దాటంగానే అవి కూడా మద్యం దుకాణాలుగా మారిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా పెట్రోలింగ్ పోలీసులు కూడా చూసీచూడనట్లుగానే వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇష్టారాజ్యంగా బార్ల నిర్వహణ
ఒకవైపు పట్టణంలో పోలీసులు గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం శ్రమిస్తుంటే బార్ల నిర్వాహకులు మాత్రం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బార్ ప్రధాన ద్వారం మూసేసి బ్యాక్ డోర్ ద్వారా బార్లు నడుపుతున్నారు. తనిఖీలకు వచ్చిన పోలీసులకు ఎంతోకొంత ముట్టజెప్పడమో లేదా వారు వెళ్లాక మళ్లీ తమ వ్యాపారాన్ని కొనసాగించడమో చేస్తున్నారు. దీంతో యువత తమ ఇళ్లకు వెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు.
అధికారుల అండతోనే!
జిల్లాలోని బార్లు, బెల్ట్ మద్యం దుకాణాలు అధికారుల అండతోనే నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. వారి అండతోనే నిర్వాహకులు తమకిష్టం వచ్చిన ధరకు అన్ని సమయాల్లో విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అనుమతుల్లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం సంగారెడ్డి చుట్టూ జాతీయ రహదారులు ఉండటంతో అల్పాహారం కోసం వెలసిన టిఫిన్ సెంటర్లు, ధాబాల్లో అర్ధరాత్రి దాటాక మద్యాన్ని అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు గానీ, పోలీసులుగానీ వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
చర్యలు తీసుకుంటాం
నిర్దేశిత సమయం మించి మద్యం అమ్మినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవు. ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దు.
–బి.మణెమ్మ, జిల్లా ఎకై ్సజ్ సహాయ అధికారి