
ప్రకృతి సంరక్షణ అందరి బాధ్యత
మెగా వన మహోత్సవంలో కలెక్టర్ ప్రావీణ్య
కొండాపూర్(సంగారెడ్డి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని తొగరపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం నిర్వహించిన మెగా వన మహోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మండల స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని, బీసీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..వన మహోత్సవం కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పర్యావరణ సంరక్షణపై అవగాహన కలుగుతుందన్నారు. పరీక్షలకు ముందుగానే అన్ని అంశాలపై విద్యార్థులు పట్టు సాధించి శత శాతం ఫలితాలు సాధించేలా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. పీఎంశ్రీ కింద స్పోర్ట్స్ మెటీరియల్ కంప్యూటర్‌లను సద్వినియోగం చేసుకుని విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని చెప్పారు. పాఠశాలలో అమలవుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పథక కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వసతి గృహంలో నాణ్యమైన భోజనం అందించాలన్నారు.
నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన
సంగారెడ్డి జోన్: వినాయక నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. శనివారం పట్టణంలోని మహబూబ్‌సాగర్ చెరువు ఆవరణలో జరుగుతున్న నిమజ్జన వేడుకల ఏర్పాట్లు తనిఖీ చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.