
దెబ్బతిన్న ఉద్యాన పంటలు
స్వల్పంగా పెరిగిన ఆకు కూరలు
జహీరాబాద్ టౌన్: పక్షం రోజులుగా కురిసిన వర్షాల ప్రభావం ఉద్యాన పంటలపై పండింది. తోటలు నీటితో నిండిపోయి కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో నేలలు బురదగా మారి తోటల వద్దకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాయలు కోయడం, మోసుకురావడం కూడా ఇబ్బందిగా మారింది. టమాటాలు రాలిపోవడంతోపాటు చాలావరకు కుళ్లిపోయాయి. ఆకుకూరలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో పాలకూర, మెంతికూర తదితర ఆకుకూరల ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక బొప్పాయి, అరటి తోటలకు కూడా నష్టం వాటిల్లింది. మండలంలోని శేఖాపూర్ గ్రామం పరిధిలో పదెకరాల బొప్పాయి తోట వర్షాలకు దెబ్బతింది. రైతు సుమారు రూ.10 లక్షల వరకు నష్టపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు దుర్గారావు కోరారు.
పగిలిన పత్తి
మునిపల్లి(అందోల్): ఇటివల పడిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీళ వల్ల పత్తి కాయలు ఎండిపోవడంతో పత్తి పగిలిపోయి వాటినుంచి పత్తి బయటకు వస్తోంది. దీంతో పత్తి పనికి రాకుండా పోతోంది. ఈ నేపథ్యంలో మండలంలోని ఆయా గ్రామాల్లో పత్తి రైతులు పెట్టుబడి వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు.