
భెల్ కార్మిక నేత కన్నుమూత
రెండుసార్లు కార్మిక రత్న అవార్డు అందజేత
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎల్లయ్య
కేటీఆర్, హరీశ్‌రావు సంతాపం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): బీహెచ్‌ఈఎల్ కార్మిక నేత, తెలంగాణ ఉద్యమకారుడు జి.ఎల్లయ్య (84) శుక్రవారం కృష్టారెడ్డిపేటలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. మెదక్ జిల్లా అక్కన్నపేటకు చెందిన ఎల్లయ్య.. 1967లో బీహెచ్‌ఈఎల్ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగంలో చేరారు. ఐఎనన్‌టీయూసీ తరపున కార్మిక సంఘం ఎన్నికల్లో 9 సార్లు విజయం సాధించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. కేసీఆర్ పిలుపు మేరకు మలిదశ ఉద్యమంలో పాల్గొన్నారు. 1999లో కాంగ్రెస్ తరపున సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం వచ్చినా.. కార్మికులకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన అవకాశాన్ని, అలాగూజజ 2009లో సైతం బీఆర్‌ఎస్ తరపున పోటీ చేయాలని కేసీఆర్ సూచించినా సున్నితంగా తిరస్కరించారు. హౌసింగ్ సొసైటీలను ఏర్పాటు చేసి తక్కువ ధరకే కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా కార్మికులకు సొంత ఇంటి కలను నిజం చేశారు. కార్మికులకు చేసిన సేవలకు గుర్తింపుగా రెండు సార్లు కార్మికరత్న అవార్డు అందుకున్నారు. కాగా, ఎల్లయ్య అంత్యక్రియలు శనివారం రామచంద్రాపురం శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.
కేటీఆర్, హరీశ్ సంతాపం
ఎల్లయ్య మరణం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాటాలు అమోఘమని కొనియాడారు. సాధారణ కార్మికుడిగా జీవితం ప్రారంభించి.. భెల్ కార్మికులందరికీ ఒక బలమైన గొంతుకగా మారిన ఎల్లయ్య జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఆయన మృతి కార్మిక లోకానికే కాకుండా తెలంగాణ సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఎల్లయ్య కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.