
అమీన్‌పూర్‌లోనే నవోదయ
పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరైంది. రూ.15 వందల కోట్లతో అమీన్‌పూర్‌లో ఏర్పాటు చేయనున్నారు. నవోదయ పాఠశాల ఏర్పాటు అంశంపై ఏర్పడిన సస్పెన్స్‌కు తెర పడింది. ఎంపీ రఘునందన్‌రావు సాక్షితో ఫోన్‌లో మాట్లాడుతూ నవోదయ పాఠశాల మంజూరు అంశంపై వివరాలను వెల్లడించారు. ఢిల్లీలో శుక్రవారం నవోదయ పాఠశాల డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బెహ్రాను కలిసి నవోదయ పాఠశాలను సంగారెడ్డి జిల్లాలోనే ఏర్పాటు చేయాలని తాను విజ్ఙప్తి చేసినట్లు తెలిపారు. తన విజ్ఙప్తిని ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. పాఠశాల నిర్మాణం, తాత్కాలిక వసతి సదుపాయాలపై సమగ్రంగా చర్చించామన్నారు. అమీన్‌పూర్‌లోనే పాఠశాల ఏర్పాటు చేసేందుకు డిప్యూటీ కమిషనర్‌ను ఒప్పించినట్లు ఎంపీ తెలిపారు.రూ.1500 కోట్లతో నిర్మించే ఈ పాఠశాలకు ప్రతిఏటా రూ.500 కోట్ల చొప్పున మూడేళ్లు నిధులు విడుదల కానున్నట్లు తెలిపారు. భవన నిర్మాణం పూర్తయ్యేలోగా ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకుని తాత్కాలిక వసతి కల్పిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రారంభం అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అమీన్‌పూర్‌లో కేటాయించనున్న స్థలాన్ని పరిశీలించేందుకు అధికారులు వచ్చే వారం క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారని రఘునందన్ వివరించారు. నవోదయ పాఠశాలను జిల్లాకు కేటాయించినందుకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఙతలు తెలిపారు.
రూ.1,500కోట్లతో పాఠశాల ఏర్పాటు
కేంద్రాన్ని ఒప్పించిన ఎంపీ రఘునందన్
వారం రోజుల్లో స్థల పరిశీలన