
సీపీఎస్ రద్దయ్యే వరకు పోరాటం ఆగదు
ఉపాధ్యాయ సంఘాల జేఏసీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ కలెక్టరేట్ ఎదుట నిరసన
సంగారెడ్డి ఎడ్యుకేషన్: సీపీఎస్ అంతం అయ్యేదాకా ఉపాధ్యాయుల పోరాటం ఆగదని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఉపాధ్యామ సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదురుగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. 2004 సెప్టెంబర్ 1 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని (సీపీఎస్) ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ సీపీఎస్ పథకం ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట పెనుశాపంగా మారిందని మండిపడ్డారు. ఈ సీపీఎస్ పథకంలో ఉద్యోగుల భాగస్వామ్యంతో ప్రతి నెల పదిశాతం వేతనం నుంచి మినహాయిస్తారని, దానికి తోడు ప్రభుత్వం కూడా పది శాతం ఉద్యోగుల ఖాతాలలో జమ చేస్తుందన్నారు. ఇలా జమ అయినా మొత్తాలను షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుందన్నారు. దీంతో షేర్ మార్కెట్ విలువల మీద ఉద్యోగుల పెన్షన్ ఆధారపడి ఉంటుందని వాపోయారు. సీపీఎస్ ఉద్యోగులు రిటైర్ అయితే రెండు, మూడు వేల పెన్షన్ మాత్రవే వస్తుందని చెప్పారు. ఉద్యోగం విరమణ తర్వాత సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా తయారవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తక్షణమే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు వై.అశోక్ కుమార్, సయ్యద్ అలీ, సోమశేఖర్, రామచందర్, ప్రసాద్, దుర్గయ్య చంద్రశేఖర్, అబ్దుల్లా, అజ్మతుల్లా, గోపాల్, పుండరికం, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.