
టీచర్ల పదోన్నతుల్లో అవకతవకలు!
దివ్యాంగ సంఘాల ఫిర్యాదు
● అర్హులకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన ● ఫిర్యాదు అందిన వారి పదోన్నతినితాత్కాలికంగా నిలిపివేత ● సరిఫికెట్ వెరిఫికేషన్ కోసంసరోజినిదేవి ఆసుపత్రికి లేఖ
ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా దివ్యాంగుల కోటాలో ఇచ్చిన పదోన్నతులపై ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వైకల్యం లేకపోయినా.. దివ్యాంగ ధ్రువీకరణ పత్రాన్ని పొంది పదోన్నతులు దక్కించుకున్నారని జిల్లా విద్యాశాఖకు దివ్యాంగుల సంఘాలు ఫిర్యాదులు చేశాయి.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
జిల్లాలో వివిధ చోట్ల పనిచేస్తున్న 221 మంది ఉపాధ్యాయులకు వారం రోజుల క్రితం పదోన్నతులు వచ్చాయి. ఇందులో 190 మంది ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్‌గా, 31 మంది స్కూల్ అసిస్టెంట్‌లకు పీజీ హెచ్‌ఎంగా పదోన్నతులు లభించాయి. సీనియార్టీ రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఈ పదోన్నతులు లభించాయి. అయితే దివ్యాంగుల కోటాలో అంధత్వ ధ్రువీకరణ పత్రంతో పదోన్నతి పొందిన ఓ ఉపాధ్యాయుడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉందని, రంగారెడ్డి జిల్లా నుంచి తాను విధులు నిర్వర్తించే పాఠశాలకు నిత్యం తన కారులో వంద కిలోమీటర్ల దూరం నుంచి కారు నడుపుకుంటూ వచ్చి వెళ్లే వ్యక్తికి అంధత్వం ఎలా ఉంటుందని దివ్యాంగుల సంఘాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. ఆధారాల కోసం ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న టోల్ గేట్లలోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తే బండారం బయట పడుతుందని పేర్కొన్నారు.
హోల్డ్‌లో పెట్టారు..
దొడ్డిదారిన అంధత్వ ధ్రువీకరణ పత్రం పొందారనే వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు.. తాత్కాలికంగా నిలిపి వేశారు. ఈ అంధత్వ ధ్రువీకరణ పత్రాలు సరైనవేనా అనే దానిపై స్పష్టత కోసం హైదరాబాద్‌లో ఉన్న సరోజినిదేవి కంటి ఆసుపత్రికి క్లారిఫికేషన్ కోసం రాశారు. రాజకీయ పలుకుబడి, విద్యా, వైద్యశాఖలో తనకున్న బంధుమిత్రుల సంబంధాలతో అంధత్వ సర్టిఫికెట్ పొందారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వారి వల్ల అర్హులైన అంధులకు అన్యాయం జరుగుతుందని దివ్యాంగుల సంఘాలు ఫిర్యాదు చేశాయి.
విమర్శలకు దారితీస్తున్న అధికారుల తీరు
దొడ్డిదారిన పదోన్నతులపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో జిల్లా విద్యాశాఖ అనుసరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంధత్వ ధ్రువీకరణ పత్రం సరైనదేనా? కాదా? స్పష్టత ఇవ్వాలని సరోజినిదేవి కంటి ఆసుపత్రికి పంపాల్సిన లేఖను ఏకంగా ఫిర్యాదు అందిన వ్యక్తి చేతికే ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఏదైనా ప్రభుత్వ ఉద్యోగిపై ఫిర్యాదు అందితే.. దానిపై ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలంటే రిజిస్టర్ పోస్టు ద్వారా గానీ, ఆయా శాఖ మెయిల్ ద్వా రా గానీ జరపాలి. కానీ ఫిర్యాదులు వచ్చిన వ్యక్తి చేతికే క్లారిఫికేషన్ లేఖలు ఇవ్వడం గమనార్హం.
వివరాలు ఇచ్చేందుకు నిరాకరణ
పదోన్నతులపై వచ్చిన ఫిర్యాదుల వివరాలు ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సిబ్బంది నిరాకరించడం గమనార్హం. పదో న్నతుల విషయంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి..? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు వంటి వివరాల కోసం డీఈఓ కార్యాలయంలో సంబంధిత సెక్షన్ సిబ్బందిని ‘సాక్షి’ సంప్రదించగా., వివరాలు ఇవ్వకుండా దాటవేయడం గమనార్హం.
క్లారిటీ వచ్చాకే ఆర్డర్ ఇచ్చాం
దివ్యాంగుల కోటా పదోన్నతికి సంబంధించి ఫిర్యాదు అందింది. దీంతో ఈ పదోన్నతిని హోల్డ్‌లో పెట్టాం. వెరిఫికేషన్ కోసం హైదరాబాద్‌లో ఉన్న సరోజినిదేవి కంటి ఆసుపత్రికి రాశాం. అక్కడి నుంచి క్లారిటీ వచ్చాకే ప్రమోషన్ ఆర్డర్ ఇచ్చాం.
: వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి