డబుల్‌ ఇన్‌కమ్‌..నో కిడ్స్‌..! | Hyderabad’s Rising ‘DINK’ Culture: Marriage Yes, Kids No! | Sakshi
Sakshi News home page

డబుల్‌ ఇన్‌కమ్‌..నో కిడ్స్‌..! అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు

Sep 2 2025 11:38 AM | Updated on Sep 2 2025 11:48 AM

DINK lifestyle: Catching the imagination of young couples Trending

పెళ్లికి ఓకే.. కానీ పిల్లలే వద్దు..!! నగరంలో ప్రస్తుతం విస్తరిస్తున్న కొత్త కల్చర్‌ ఇది.. దీనినే డబుల్‌ ఇన్‌కమ్‌.. నో కిడ్స్‌ (డింక్‌) అని పిలుస్తున్నారు. దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఇప్పటికే కొనసాగుతున్న ఈ ట్రెండ్‌.. ప్రస్తుతం హైదరాబాద్‌లోనూ కనిపిస్తోంది. పలు అధ్యయనాల ప్రకారం ఈ కల్చర్‌ ఏటా 30 శాతం పెరుగుదలను నమోదు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న ఖర్చులే ప్రధాన కారణమని పలువురు యువత చెబుతుండగా.. తమ జీవితంలో ఉద్యోగం, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో తమకు నచ్చినట్లుగా బతికేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరికొందరు చెబుతున్నారు. ఓ వైపు పిల్లల కోసం లక్షలకు లక్షలు వెచ్చించి ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్న జంటలు పెరుగుతోంటే.. మరోవైపు ఈ తరహా కల్చర్‌ వేళ్లూనుకుంటోంది..      

కేస్‌ స్టడీస్‌.. 
‘‘వరుణ్‌ వయసు 33 ఏళ్లు.. ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. ఏడాదికి రూ.40 లక్షలకు పైగా జీతం వస్తోంది.. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు.. ఆల్కహాల్, స్మోకింగ్‌ వంటి అలవాట్లేమీ లేవు.. పెళ్లి ప్రస్తావన తెచి్చన ప్రతిసారీ దాటేస్తూ వచ్చాడు.. తాజాగా అతను చెప్పిన సమాధానంతో వరుణ్‌ తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది.. తనను చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలో చెబుతూనే భవిష్యత్తులో పిల్లలు వద్దు అనుకునే అమ్మాయి కావాలని చెప్పాడు!!’’

‘‘తిరుమలరావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. ఈయనకు ఇద్దరు సంతానం.. వీరిలో కుమారుడు తేజ, కుమార్తె తనూజ.. మాస్టర్స్‌ పూర్తిచేసిన వీరికి కొన్నేళ్ల క్రితమే ఘనంగా వివాహం జరిపించారు.. కుమార్తెకు ఇద్దరు పిల్లలు.. కుమారుడు తేజకు పెళ్లయి ఐదేళ్లు అవుతోంది. పిల్లల గురించి అడగ్గా.. మాకు పిల్లలు వద్దని నిర్ణయించుకున్నామని చెప్పేశాడు. వారసుల కోసం కలలుగంటున్న తిరుమలరావు.. కొడుకు చెప్పిన సమాధానంతో హతాశుడయ్యాడు. దగ్గరి మిత్రులతో ఈ వింత పోకడ గురించి చెప్పుకుంటూ రెండేళ్లుగా సతమతం అవుతున్నాడు.. తన కొడుకు–కోడలు ‘డింక్‌’ కపుల్‌గా మిగిలిపోవాలని అనుకుంటున్నట్లు సన్నిహితులకు చెబుతూ వాపోతున్నాడు.’’

‘విక్రాంత్‌.. నగరంలోని పేరెన్నిక కలిగిన ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసి, అమెరికా వెళ్లి మాస్టర్స్‌ పూర్తిచేశాడు.. అక్కడే ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. పదేళ్లలో మరో కంపెనీలోకి మారి కెరీర్‌ పరంగా ఎంతగానో ఎదిగాడు.. 35 ఏళ్ల వయసులోనూ పెళ్లి ఆలోచనే చేయడం లేదు.. తల్లిదండ్రులు ఎంతగా అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు.. కెరీర్‌ పరంగా, సామాజిక బంధాలు కొనసాగించడంలో ఎంతో పరిపక్వతతో ఉండే తమ కుమారుడు పెళ్లి విషయాన్ని ఎందుకు దాటవేస్తున్నాడో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇటీవలే డింక్‌ కల్చర్‌ గురించి తెలుసుకుని మరింత ఆందోళన చెందుతున్నారు.. పిల్లలు లేకపోయినా కనీసం పెళ్లయినా చేసుకుంటే అదే పదివేలంటూ విక్రాంత్‌ను బతిమిలాడుతున్నారు..’’ 

తరచి చూస్తే.. నగరంలో ఇలాంటి పరిస్థితులు అనేకం.. ఓ వైపు వారసుల కోసం ఆస్తులు కూడబెట్టే సంస్కృతి కలిగిన మన దేశంలో నెమ్మదిగా వారసులే వద్దు అనుకునే కొత్త సంస్కృతి తెరతీస్తోంది. ‘డబుల్‌ ఇన్‌కమ్‌ నో కిడ్స్‌’ (డింక్‌) పేరిట నేటి తరం పిల్లలకు దూరంగా ఉంటోంది. పాశ్చాత్య దేశాల్లో డింక్‌ ప్రభావం వల్ల జనాభా రేటు గణనీయంగా పడిపోతోంది. ఈ సంస్కృతి తాజాగా దేశంలోనూ, నగరంలోనూ శరవేగంగా విస్తరిస్తోంది. యేటా 30 శాతం డింక్‌ సంస్కృతి పెరుగుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. 

ఓ వైపు పిల్లల కోసం పరితపిస్తూ పలు జంటలు ఫెర్టిలిటీ సెంటర్ల బాటపడుతోంటే.. అదే సమయంలో పిల్లలే వద్దు అనుకునే పరస్పర విరుద్ధ ఆలోచనా ధోరణి కలిగిన జంటలూ పెరుగుతుండడం గమనార్హం. ఈ ధోరణికీ పలు కారణాలు లేకపోలేదు.. ఇందుకు పెరుగుతున్న ఖర్చులే ప్రధాన కారణమని కొందరు, కెరీర్‌లో ఎదుగుదలకు కొందరు, ఆర్థిక స్వేచ్ఛ, బాంధవ్యాలకు దూరంగా ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.  

ప్రభావితం చేసే కారణాలు..  

ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను పెంచడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పనిగా భావిస్తున్నారు. పెరిగిన జీవన ప్రమాణం, ఖరీదైన విద్య, కళాశాలల ఫీజులు.. తమకు ఆర్థిక కష్టాలు తెచ్చిపెడతాయని ఆందోళన చెందుతున్నారు. ఇందుకోసం అనేక రకాలుగా కాంప్రమైజ్‌ కావాల్సి వస్తుందని భావిస్తున్నారు. 

నచ్చిన లైఫ్‌స్టైల్‌ అనుభవించాలంటే పిల్లలు అడ్డంకిగా మారతారనే ఆందోళన. నచ్చిన ప్రదేశాలను సందర్శిస్తూ, టూర్‌లకు వెళ్లేందుకు తగిన సమయం దొరకదనే కారణాలు చెప్పే వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో? 

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ విధుల్లో ఏమాత్రం ఏమరపాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించినా మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో పిల్లలను కని, పెంచడం వంటి కుటుంబ బాధ్యతలతో తమ కెరీర్‌ కాపాడుకోవడం, ఎదుగుదలకు ప్రతిబంధకంగా భావిస్తున్నారు. 

సమాజంలో పెరిగిపోతున్న విపరీత ధోరణులతో కుటుంబ బంధాలు బలహీనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వార్థపూరిత ఆలోచనా విధానం తప్పు కాదనే భావనలూ బలపడుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న పిల్లలను చూసి, భవిష్యత్తులో తమ పరిస్థితి కూడా ఇంతే కదా అనే ఆలోచనలో పలువురు ఉన్నారు. 

మారుతున్న వాతావరణ పరిస్థితులు, కలుషిత, కల్తీ ఆహారం, అవినీతి తదితర అంశాలు సైతం వీరిపై ప్రభావం చూపిస్తున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. భవిష్యత్తులో అలాంటి క్లిష్టమైన పరిస్థితులను తమ పిల్లలు ఎదుర్కోలేరని, అందుకే పిల్లలు వద్దు అనుకుంటున్నామని చెప్పేవారూ లేకపోలేదు. 

ఇటీవల కాలంలో పెళ్లిళ్లు చేసుకున్న ‘కొలీగ్స్‌’ కుటుంబాల్లో ఎదురవుతున్న సమస్యలు వీరిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తమ టీమ్‌లో పది జంటల్లో ఆరుగురు ఐదేళ్లలోనే విడాకుల వరకూ వెళ్లారని ‘డింక్‌ కపుల్‌’ ఆలోచనా ధోరణి కలిగిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన అనుభవాన్ని చెప్పడం గమనార్హం. 

ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల చాలామందికి నలభై ఏళ్ల వరకూ పిల్లలు కలగడం లేదు. మరింత వయసు పెరిగాక పిల్లలు కలిగితే ఇబ్బందులు తప్పవని భావిస్తూ, మరికొంత కాలం ఇలాగే గడిపేద్దాం అనుకునే వారు కూడా ఉన్నారు.

ఏమిటీ డింక్‌? 
డబుల్‌ ఇన్‌కమ్, నో కిడ్స్‌.. ఉద్యోగరీత్యా లేదా ఇతర మార్గాల ద్వారా భార్యా, భర్తలిద్దరూ సంపాదిస్తూ, పిల్లలు వద్దు అనుకునే జంటలనే ‘డింక్‌ కపుల్‌’గా వ్యవహరిస్తూ ఉంటారు. 

ఆర్థిక పరిస్థితులు ఓ కారణం కాగా, తమకు నచి్చనట్లుగా బతికేందుకు పిల్లలు అడ్డుగా ఉంటారని భావిస్తూ పలు జంటలు ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. 90వ దశకంలో జని్మంచిన వారిలోనే ఇలాంటి ధోరణి పెరుగుతోందని, జనరేషన్‌ జెడ్‌ హయాంలో పరిస్థితులు ఎంతగా మారిపోతాయో ఊహించడం కష్టమే!

పరిష్కారాలేంటి? 
ఇద్దరూ ఉద్యోగం చేసుకునే జంటలు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఇలాంటి సమస్యలు ఉండకపోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. తమ ఆదాయానికి సరిపడే జీవన శైలిని మార్చుకుంటూ అవసరమైతే ఎవరో ఒకరు ఉద్యోగాన్ని వదిలేసి, పిల్లలు, కుటుంబంపై దృష్టిపెట్టాలంటున్నారు విశ్లేషకులు..  

ప్రతికూల ప్రభావాలు..

  • డింక్‌ కపుల్‌ కల్చర్‌ పెరగడం వల్ల జనాభా వృద్ధి రేటు గణనీయంగా పడిపోతుంది. తదుపరి తరంలో వృద్ధుల సంఖ్య పెరిగి, యువత సంఖ్య భారీగా పడిపోయే ప్రమాదముంది. వృద్ధాప్యంలో డింక్‌ కపుల్‌ బాగోగులు చూసుకునే వారు కరువవుతారు. వృద్ధాశ్రమాలకు డిమాండ్‌ పెరుగుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

  • నైపుణ్యం కలిగిన యువత శాతం గణనీయంగా తగ్గితే సమాజంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఉద్యోగులు, కార్మికుల సంఖ్య తగ్గిపోయి ఉత్పత్తి రంగం క్షీణిస్తుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదముంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement