
సోయాబీన్ ఎదుగుదల ఇలా..
డీడీఎస్–కేవీకే ఆధ్వర్యంలోరైతులకు అవగాహన
జహీరాబాద్: సోయాబీన్ పంట ఎదుగుదలకు గాను డీడీఎస్–కేవీకే ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. సోమవారం మండలంలోని దిడిగి గ్రామ శివారులో గల కేవీకేలో జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, ఝరాసంగం, కంగ్టి మండలాల్లోని హుగ్గెల్లి, తూంకుంట, బూర్దిపాడ్, సత్వార్, కొత్తూర్(బి), రేజింతల్, మెటల్‌కుంట, కుప్పానగర్, గౌసాబాద్ తండా, దెగుల్‌వాడి గ్రామాలకు చెందిన రైతులకు సామూహిక ప్రదర్శన క్షేత్రాలలో భాగంగా సోయాబీన్ పంట ఎదుగుదల, పురుగుల నివారణకు సంబంధించిన 250 ఎకరాలకు కావాల్సిన జిగురు అట్టలు, పంచగవ్య 1,250 లీటర్లు, దశపర్ణి కషాయం 1,500 లీటర్లు, వేపనూనె 150 లీటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సస్యరక్షణ శాస్త్రవేత్త స్నేహలత మాట్లాడుతూ.. తెగుళ్లు, పురుగుల నివారణకు పసుపుపచ్చ, నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 12 వరకు అక్కడక్కడ అమర్చడం ద్వారా తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులను నివారించుకోవచ్చని వివరించారు. మట్టి విభాగం నిపుణుడు ఇ.స్వామి మాట్లాడుతూ సోయాబీన్ పంటలో ఎరువుల యాజమాన్యంలో భాగంగా 19:19:19 వేసుకోవాలని, పంచగవ్య 16 రకాల పోషకాలు కలిగి ఉంటుందని, మొక్క ఎదుగుదలకు, రోగ నిరోధక శక్తి పెంచుతుందన్నారు. కార్యక్రమంలో పది గ్రామాల రైతులు, వ్యవసాయ యూనివర్శిటీ విద్యార్థులు పాల్గొన్నారు.