
పొలాల్లో నీరు నిల్వ ఉండొద్దు
● వ్యవసాయ శాస్త్రవేత్త విజయ్‌కుమార్ ● నీట మునిగిన పంటల పరిశీలన
న్యాల్‌కల్(జహీరాబాద్): ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినకుండా ఉండేందుకు పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దీంతో కొంత మేరకు పంట నష్టాన్ని నివారించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని మొల్కన్ పాడ్ గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పంట పడిపోకుండా ఉండేందుకు మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలని సూచించారు. పొలంలోంచి నీరు వెళ్లేందుకు 40 సెంటీ మీటర్ల లోతు, 60 సెంటీ మీటర్ల వెడల్పు ఉండేలా కాల్వలు తీయాలన్నారు. తెగుళ్ల నివారణకు మోనోక్రోటోపాస్, లేదా క్లోరి ఫైరిపాస్ మందును తగిన మోతాదులో పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు. కాగా, మండల పరిధిలోని చాల్కి, చీకూర్తి, హుస్సేన్ నగర్ తదితర గ్రామాల శివారులో నీట మునిగిన పంటలను ఏఈఓలు పరిశీలించారు. ఎగువ ప్రాంతమైన కర్నాటక నుంచి మంజీరలో పెద్ద ఎత్తున వరద వచ్చి చేరడంతో సుమారు 300 ఎకరాల్లో పత్తి, పెసర, మినుము తదితర పంటలు నీట ముగినట్లు వ్యవసాయ శాఖ అధికారి అభినాష్ వర్మ తెలిపారు.