
కలుపు కష్టాలు!
పెరిగిన పెట్టుబడులు
రైతుల ఆందోళన
పొలాల్లో పెరిగిపోతున్న కలుపుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీలకు డిమాండ్ పెరగడంతో సకాలంలో కలుపుతీయని కారణంగా వర్షాలకు చేలన్నీ బీళ్లుగా మారుతున్నాయి. కలుపు తీసేందుకు కూలీలు దొరక్క పైగా రేట్లు పెంచడం వల్ల పెట్టుబడులు పెరిగి నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. – జహీరాబాద్ టౌన్
జహీరాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని జహీరాబాద్, న్యాల్‌కల్, ఝరాసంగం, కోహీర్ మండలాల్లో రైతులు ఖరీప్ సీజన్‌లో పత్తి, సోయాబిన్, పెసర, కంది, మినుము తదితర పంటలను సాగు చేశారు. సుమారు 80 వేల ఎకరాల్లో పత్తి, 55 వేల ఎకరాల్లో సోయాబిన్, 6,724 ఎకరాలో మినుము, 7,589 ఎకరాల్లో పెసర పంట సాగవుతుంది. పంటలు ఆశాజనకంగా ఉండగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలతో పాటు కలుపు మొక్కలు పెరిగాయి. పత్తి. సోయాబిన్, మినుము, మొక్కజొన్న, పెసర, కంది చేలల్లో విపరీతంగా కలుపు పెరడంతో నివారణకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పత్తి చేన్లలో నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో నీటి తడి ఆరకుండా మొక్కల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు వెసులుబాటు లేక కలుపు తీసేందుకు కూలీలు దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీల కొరత వల్ల కొంత మంది కలుపు నివారణ మందులపై ఆధారపడుతున్నారు. కూలీల ధరలు పెరగడంతో పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్నట్లు రైతులు వాపోతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో దినసరి కూలీ రూ. 500 ఉండగా రూ.600 చెల్లించాల్సి వస్తుంది. ఎకరం పొలంలో కలుపు తీసేందుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు అవుతుంది.
సకాలంలో సస్యరక్షణ చేపట్టాలి
మొక్కల మధ్యన కలుపును పూర్తిగా నివారిస్తేనే దిగుబడులు పెంచుకునేందుకు ఆస్కారం ఉంది. దీంతో పొలాల్లో సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పత్తి కాయ అభివృద్ధి దశలో ఉంది. పొలాల్లో చేరిన మురుగునీరును తొలగించాలి. తొందరగా అంతర కృషి చేసుకోవాలి. మొక్కజొన్న కంకి దశలో ఉంది. ఎక్కువ నీటికి పంట తట్టుకోలేదు. అందుకని వెంటనే పొలం నుంచి నీటిని తొలగించాలి. క్షేత్రస్థాయిలో తిరుగుతున్న వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్
కూలీలకు డిమాండ్