
సైన్యానికి సాంకేతిక దన్ను
ఐఐటీహెచ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ‘విగ్రహ’ఏర్పాటు
● రక్షణ రంగానికి అవసరమైన ఆధునిక సాంకేతికతపై పరిశోధనలు ● అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన ఐఐటీహెచ్, ఎస్‌డీడీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (ఐఐటీ) హైదరాబాద్ భారత సైన్యానికి దన్నుగా నిలవనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విస్తృత పరిశోధనలు చేస్తున్న ఈ విద్యా సంస్థ ఇకపై దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతానికి పరిశోధన సహకారాన్ని అందించనుంది. ఈ మేరకు ఐఐటీహెచ్, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్‌కు చెందిన సిమ్యూలేటర్ డెవలప్‌మెంట్ డివిజన్ (ఎస్‌డీడీ, సికింద్రాబాద్)తో కీలకం ఒప్పందం చేసుకున్నట్లు ఐఐటీహెచ్ వర్గాలు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఐఐటీలో ‘విగ్రహ’పేరుతో ఓ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని స్థాపిస్తున్నారు. ఈ రెండు అత్యున్నత సంస్థలు సంయుక్తంగా శాసీ్త్రయ, సాంకేతిక అంశాలపై పరిశోధనలను చేపట్టనున్నాయి.
ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్ ఇండియన్ ఆర్మీతో కలిసి 3 డీ–ప్రింటెడ్ మిలిటరీ బంకర్ల నిర్మాణంపై పరిశోధన చేస్తోంది. ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశం లేహ్‌లో ఈ బంకర్లను నిర్మిస్తోంది. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్‌తో కలిసి ఈ ప్రాజెక్టును కొనసాగిస్తోంది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)తో కూడా ఐఐటీహెచ్ కలిసి పనిచేస్తోంది. క్షిపణులు, క్షిపణి రక్షణ వ్యవస్థలకు సంబంధించి పనితీరు విశ్లేషణ, డిజైన్లు, డేటా ఏఐ సాంకేతికత తదితర విభాగాలపై కూడా ఐఐటీహెచ్ సేవలందిస్తోంది. అలాగే తూనీగలు, కీటకాలు, పక్షుల ఆకారంలో గాలిలో ఎగురుతూ సరిహద్దుల్లో నిఘా పెట్టే బయో ఇన్‌స్పైర్డ్ డ్రోన్లు వంటి వాటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా భారత సైన్యానికి సాంకేతిక శిక్షణ సంస్థతో కలిపి ఈ ప్రాజెక్టు చేపట్టడం గమనార్హం.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, డ్రోన్లు, అగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ, మానవ రహిత వాహనాలు తదితర అంశాలపై ఈ ఎస్‌ఎస్‌డీ సైన్యానికి శిక్షణను అందిస్తోంది. ఇలాంటి అత్యున్నత సంస్థతో కలిసి ఐఐటీహెచ్ పనిచేయనుంది. అలాగే రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్ కార్యకలాపాలను ప్రోత్సహించనున్నారు. ఐఐటీహెచ్‌లో చదువుకుంటున్న విద్యార్థులకు ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్‌లో ఇంటర్నషిప్ చేసే అవకాశాలుంటాయి. ఈ కీలక ఒప్పందాలపై ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఎస్‌డీడీ తరఫున బ్రిగేడియర్ ఏ.కే.చతుర్వేది సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఈ ఒప్పందం నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని, రక్షణ దళాల సాంకేతిక సామర్థ్యాలను పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందన్నారు.