
డ్వాక్రా మహిళలకు ఆర్టీసీ బస్సులు
ఆర్టీసీకి అద్దె ఇవ్వనున్న
మహిళా సమాఖ్య సంఘాలు
కసరత్తు చేస్తున్న అధికారులు
సంగారెడ్డి టౌన్: గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళల స్వయం ఉపాధికి బాటలు వేయడంతోపాటు వారిని వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా రుణాలను అందజేస్తోంది. వీటితోపాటు మహిళా క్యాంటీన్లు, డెయిరీ పార్లర్లు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌ల బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను కొనుగోలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయం రావడంతోపాటు బస్సుల కొరత సైతం తీరుతోంది. జిల్లాలో మూడు డిపోల పరిధిలో ప్రస్తుతం 260 బస్సులుండగా మరికొన్ని మహిళా సంఘాల యొక్క బస్సులు పెరగనున్నాయి.
నెలకు రూ.70వేల వరకు ఆదాయం
జిల్లావ్యాప్తంగా 695 గ్రామ సంఘాలుండగా, అందులో 25 సమాఖ్య మహిళా సంఘాలు, ఒక లక్ష 95వేల మహిళా సభ్యులున్నారు. ప్రభుత్వం రూ.30 లక్షలు ఇవ్వడంతో, మహిళా సమాఖ్య సంఘాల నుంచి రూ.6 లక్షలు తీసుకుని బస్సును కొనుగోలు చేయనున్నారు. నెల నెలా సుమారు రూ.60 నుంచి రూ.70 వేల వరకు ఆదాయం మహిళా సమాఖ్య సంఘాలకు సమకూరనుంది. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. ఈ క్రమంలో బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో బస్సుల కొరత ఏర్పడింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడం ఆర్టీసీకి భారంగా మారింది. ఈ క్రమంలో మహిళా సంఘాల అద్దె బస్సుల వినియోగించడంతో బస్సుల కొరత కూడా కొంత తగ్గనుంది. ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి బస్సులను అద్దెకు తీసుకునే బదులు మహిళా సంఘాలు కొనుగోలు చేసిన బస్సులను తీసుకుంటుండటంతో ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సంఘాలకు లాభం చేకూరనుంది.
త్వరలో జిల్లాకు మంజూరు