రెస్క్యూ టీం సహాయంతో శవాన్ని బయటకు తీసిన పోలీసులు
చేర్యాల(సిద్దిపేట): ప్రమాదవశాత్తు కుంటలో పడిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని వేచరేణి గ్రామంలో శనివారం ఉదయం వెలుగు చూసింది. స్థానికులు, కొమురవెల్లి పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎగుర్ల సాయిబాబు(30) శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో పలు చోట్ల వెతికిన కుటుంబ సభ్యులు పొలం దగ్గర నుంచి వచ్చే దారిలో కుంట వద్ద సాయిబాబు బైక్‌ను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా కొమురవెల్లి ఎస్‌ఐ రాజు, తహసీల్దార్ దిలీప్‌నాయక్ కుంట వద్దకు వెళ్లి రెస్క్యూ టీం సహాయంతో శవాన్ని బయటకు తీశారు. పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు దారి పక్కనే ఉన్న కుంటలో పడినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఘటనా స్థలానికి వచ్చి గాలింపు చర్యలను పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చికిత్స పొందుతూ యువకుడు..
బెజ్జంకి(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సౌజన్య కథనం మేరకు... ముత్తన్నపేట గ్రామానికి చెందిన బొర్ర పర్షరాములు(48) , భార్య, ఇద్దరు కుమారులతో కూలీ పని చేస్తూ జీవిస్తున్నాడు. ఈనెల 20న గ్రామం నుంచి మండల కేంద్రానికి బైక్‌పై సరుకుల కోసం వెళ్తుండగా పంది అడ్డు వచ్చి బైక్‌ను ఢీకొంది. దీంతో కిందపడ్డ అతడి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అంబులెన్సులో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఈనెల 23న కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై స్వెరోస్, ఎంఆర్‌పీఎస్, దళిత శక్తి సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్తులు బెజ్జంకి గ్రామ పంచాయతీ వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు.
బహిర్భూమికి వెళ్లి...
కౌడిపల్లి(నర్సాపూర్): బహిర్భూమికి వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తునికి గ్రామంలో జరిగింది. శనివారం ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చాకలి సత్తయ్యకు ఇద్దరు భార్యలు. పెద్దభార్యకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కొడుకు చాకలి మల్లేశం(28) ఈనెల 28న రాత్రి బహిర్భూమికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. ఆరోజు రాత్రి కుటుంబ సభ్యులు పలుచోట్లు వెతికినా అతని ఆచూకీ దొరకలేదు. కాగా శనివారం ఉదయం గ్రామ సమీపంలోని కలీల్‌సాగర్ చెరువులో మల్లేశం మృతదేహం నీటిపై తేలడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గుర్తించి బయటకు తీశారు. ఇదిలా ఉండగా మృతుని అన్న శ్రీనివాస్ సైతం సుమారు ఆరునెలల క్రితం పశువులు మేపేందుకు వెళ్లి ఫిట్స్ రావడంతో చెరువులో మునిగి చనిపోయాడు. ఆరునెలల్లో అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
కుంటలో పడి వ్యక్తి మృతి
కుంటలో పడి వ్యక్తి మృతి