
డెయిరీ ఫామ్‌పై పోలీసుల దాడి
210 కిలోల కల్తీ నెయ్యి స్వాధీనం
హత్నూర( సంగారెడ్డి): కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారన్న అనుమానంతో సీసీఎస్ పోలీసులు దాడి చేసి సుమారు 210కేజీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం... మండలంలోని గోవిందరాజు పల్లి గ్రామ శివారులోని మధుప్రియ డెయిరీ ఫామ్‌పై పోలీసులు శనివారం దాడి చేశారు. 10 కేజీల నెయ్యి బకెట్లు 16, 30 లీటర్ల పెద్ద క్యాన్లు రెండు, కాటన్ మంచి నూనె ప్యాకెట్లు, కార్న్‌ఫ్లోర్ పౌడర్, టెస్టింగ్ సాల్ట్ ప్యాకెట్, మిల్క్ పౌడర్, బేకింగ్ సోడా, ఇతర కెమికల్ వస్తువులను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. డెయిరీ నిర్వాహకుడితోపాటు ఆటో, కల్తీ నెయ్యిగా భావిస్తున్న డబ్బాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై ఎస్సై శ్రీధర్ రెడ్డిని సంప్రదించగా స్వాధీనం చేసుకున్న వాటిని స్టేషన్‌లో ఉంచామని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వచ్చిన తర్వాత ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తామని తెలిపారు. కాగా గతంలో కూడా ఈ డెయిరీపై కల్తీ పాలు తయారు చేస్తున్నారని కేసు నమోదు చేశారు.