● కౌన్సెలింగ్ ద్వారా సెర్ప్ సిబ్బంది బదిలీ ● అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
సిద్దిపేటరూరల్: సెర్ప్ సిబ్బంది మహిళా సంఘాల బలోపేతానికి బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో ఆదేశాల మేరకు సెర్ప్ సిబ్బందికి కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని సెర్ప్ సిబ్బందిని ఎల్ –2, ఎల్ –1, ఎంఎస్ సీసీఎస్ 115 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు అన్ని మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ అందించామన్నారు. ప్రతి మహిళా సంఘం ఒక రిజిస్టర్ పెట్టి ఎక్కడ ఏ ఏ కార్యక్రమాల్లో ఉపయోగించారు? ఎంత ఆదాయం వచ్చింది? అనే విషయాలు నమోదు చేసుకోవాలన్నారు. క్లస్టర్ల వారీగా ప్రజలకు డ్రై డేపై, నీటి నిల్వతో దోమల లార్వా పెరిగి, వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, అదనపు డీఆర్డీఓ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.