
ఉధృతంగా ప్రవహిస్తున్న హల్దీవాగు
● పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
● ధ్వంసమైన కాజ్‌వే
తూప్రాన్: భారీ వర్షాలకు చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని కిష్టాపూర్, గుండ్రెడ్డిపల్లి గ్రామాలకు వెళ్లాల్సిన ప్రధాన రహదారి హల్దీవాగుపై నిర్మించిన కాజ్‌వే పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఫలితంగా కిష్టాపూర్, వెంకటాయిపల్లి, నర్సంపల్లి, గుండ్రెడ్డిపల్లి, గౌడిగుడెం, దాతర్‌పల్లి, మల్కాపూర్, కోనాయిపల్లి(పీబీ) గ్రామాలతో పాటు ఇతర దౌల్తాబాద్, వర్గల్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు సుమారు 15 కిలోమీటర్ల తిరిగి వెళుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. తూప్రాన్ పెద్ద చెరువు అలుగు నుంచి భారీగా నీరు వెళుతుండటంతో చెరువు కట్టపైకి వెళ్లాల్సిన దారి నీటి ప్రవాహానికి కోతలు ఏర్పడి భారీ గుంతలు ఏర్పడ్డాయి.