
వ్యక్తిగత ఫొటోలు షేర్ చేయొద్దు
సైబర్ సెక్యూరిటీ బ్యూరో
డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి
పటాన్‌చెరు టౌన్: విద్యార్థులు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేసే ముందు ఆలోచించాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్లు డబ్బును దోచుకోవడమే కాకుండా... వ్యక్తిగత డేటాను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా దొంగిలిస్తారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థులు ఫేస్ బుక్, వాట్సప్, ఈ–మెయిల్‌తోపాటు ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చే లింకులను క్లిక్ చేయొద్దని తెలిపారు. అలాగే ఆన్‌లైన్‌లో గేమ్స్, యాప్‌లను డౌన్‌లోడ్ చేయకూడదని సూచించారు. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
జగదేవ్‌పూర్(గజ్వేల్): మండలంలోని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్–4) శైలేష్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హైమావతి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తిమ్మాపూర్‌లో పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించాడని, దీంతో గ్రామంలో ఇద్దరు డెంగీతో మరణించారు. ఈ నేపథ్యంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా శైలేష్ సస్పెన్షన్ కావడంతో అనంతసాగర్ కార్యదర్శిని తిమ్మాపూర్‌కు ఇన్‌చార్జిగా నియమిస్తూ ఎంపీడీఓ రాంరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
హవేళిఘణాపూర్(మెదక్): వినాయక చవితి సందర్భంగా మెదక్ వెళ్లి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఆటోలో వస్తుండగా రాజ్‌పేట వాగు వద్ద వరద ఉధృతిలో కొట్టుకుపోయిన వారిలో దామరంచ యాదాగౌడ్(38) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. మరో వ్యక్తి బెస్త సత్యనారాయణ మృతదేహం గురువారం లభ్యమైంది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు డ్రోన్ కెమెరాలతో వెతకగా ఆటోకు వంద మీటర్ల దూరంలో ఉన్న నీటిలో శవం ఉన్నట్లు గుర్తించి బయటకు తీశారు.
మృతుడి కుటుంబాలకు ఎమ్మెల్యే సాయం
వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన వారి రెండు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రకటించారు. ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకొని చేయూతనిస్తామని తెలిపారు.
ఆచూకీ కోసం గాలింపు
సంగారెడ్డి : పలు ఇబ్బందులతో వ్యక్తి పారుతున్న మంజీరా నదిలో దూకాడు. ఈ ఘటన శుక్రవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఉమ్మడి పుల్కల్ మండలంలోని శివంపేట గ్రామానికి చెందిన బదంపేట మల్లేశం గౌడ్ (50) బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పులకల్ పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి నది వద్ద గాలింపు చర్యలు చేపట్టేసరికి చీకటి కావడంతో నిలిపివేశారు. తిరిగి శనివారం గాలింపు చర్యలు చేపట్టనున్నారు. మల్లేశం నదిలో దూకే దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు అయింది.
మూడు రోజుల్లో 28 కాల్స్ మాత్రమే..
మెదక్ కలెక్టరేట్: వరదల నుంచి తక్షణ సాయం అందించేందుకు మెదక్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంను ప్రజలు అంతంత మాత్రమే సద్వినియోగం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 సెంటి మీటర్ల వర్షం కురిసింది. వర్షానికి రోడ్లు, కట్టలు తెగిపోయి, వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లాయి. అయితే గురువారం రాత్రి మెదక్ మండలంలోని గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన మహేశ్ తన భార్య గర్భిణి కావడంతో ఇబ్బందులు పడుతున్నామని ఫోన్ చేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కంట్రోల్‌రూంకు పాపన్నపేట, హవేళిఘణాపూర్ మండలాల నుంచి కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.