
టెండర్ల ద్వారా మల్లన్నకు రూ.3.43కోట్లు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం అంతకంతకూ పెరుగుతోంది. అదే రీతిలో ఆలయంలో నిర్వహించే పలు అంశాలకు సంబంధించి నిర్వహించే బహిరంగ వేలం, సీల్డ్ టెండర్లు, ఆన్‌లైన్ టెండర్ల ద్వారా స్వామి వారికి ఆదాయం సమకూరింది. ఇటీవల ఈ సంవత్సరానికి టెండర్లు నిర్వహించారు. ఆలయంలో కొబ్బరి ముక్కల సేకరణ ద్వారా రూ.71,77,777, ఒడిబియ్యం, వస్త్రాలు, పసుపు సేకరణ ద్వారా రూ.70. 56లక్షలు, చెప్పుల స్టాండ్ ద్వారా రూ.15 లక్షలు, కొబ్బరికాయల విక్రయం ద్వారా రూ.45లక్షల 50వేల 115, ఎల్లమ్మ ఆలయం ఒడిబియ్యం సేకరణ ద్వారా రూ.18.30 లక్షల ఆదాయం వచ్చింది. కోరమీసాల ద్వారా రూ.16.61లక్షలు, తలనీలాల ద్వారా రూ.1,01, 01,116, సులభ్ కాంప్లెక్స్ నిర్వహణ ద్వారా రూ.4.71వేలు రాగా మొత్తం రూ.3కోట్ల 43లక్షల 47,009 ఆదాయం సమకూరింది. గతేడాది టెండర్ల ద్వారా రూ.2లక్షల 44వేల 28వేలు సమకూరింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రూ.99లక్షల 19,009 అధిక ఆదాయం వచ్చింది. పెరిగిన ఆదాయంతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆలయ ఈఓ అన్నపూర్ణ తెలిపారు.
గతేడాది కంటే రూ.99 లక్షలు అధికం