
గణనాథుడి సన్నిధిలో యాదాద్రి కలెక్టర్
పటాన్‌చెరు టౌన్: వినాయక చవితి పురస్కరించుకుని పటాన్‌చెరు మండలం పరిధిలోని రుద్రారం గ్రామ సమీపంలో గణేశ్‌గడ్డ దేవస్థానంలో గణేశుడిని బుధవారం యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు సిబ్బంది తీర్థ ప్రసాదాలను అందజేసి, కలెక్టర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంతోశ్ జోషి,జగదీశ్వర్ స్వామి, చంద్రశేఖర్ ,అయ్యప్ప ,సతీష్,ఆలయ ఈవో లావణ్య, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్‌కు టీజీఈజేసీ వినతి
సంగారెడ్డి: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీజీఈజేసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్‌కు ఆ సంఘం నాయకులు గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు జావెద్ అలీ మాట్లాడుతూ...పెన్షన్ విధానంలో వచ్చిన మార్పులు ఉద్యోగుల భవిష్యత్ భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, తక్షణమే సరైన నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. సెప్టెంబర్ 1న నిర్వహించతలపెట్టిన పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీజీ జేఏసీ కార్యదర్శి వైద్యనాథ్, కో చైర్మన్ గంగాధర్ టీఎన్జీవోస్ నాయకులు రవి పాల్గొన్నారు.
గండ్లను పూడ్చటంలో
కాలయాపన
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
పుల్‌కల్(అందోల్): సింగూరు పంట కాలువలకు గండ్లు పడి పక్షం రోజులైనా పూడ్చకపోవడం పట్ల అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పాలకుల తీరును విమర్శించారు. పక్షం రోజుల క్రితం ఇసోజిపేట వద్ద, బస్వాపూర్ వద్ద సింగూరు పంట కాలువకు గండ్లు పడితే స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహా అట్టహాసంగా ట్రాక్టర్‌పై వెళ్లి గండ్లను పరిశీలించారు. పరిశీలించిన గండ్లను పూడ్చకుండా కాలయాపన చేస్తే ఆయకట్టు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గండ్లు పడటం వల్ల కాలువ లిఫ్టులను మూసివేశారని, ఆయకట్టుకు సింగూరు నీటిని నెల రోజులు తర్వాత వదలటంతో రైతులు ఆలస్యంగా నాట్లు వేశారని తెలిపారు. వర్షాలతో ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే మంత్రి దామోదర పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఉపకారవేతనాలు
విడుదల చేయాలి
గణనాథుడికి వినతి పత్రం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపకారవేతనాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ ఆకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో వినాయకుడికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆకాష్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు చెల్లించవలసిన రూ.8,500 కోట్ల స్కాలర్షిప్‌లు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించే బుద్ధిని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసాదించాలని వినాయకునికి ప్రార్థించినట్లు తెలిపారు.